టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్‌ రవి | Vasu, Btech Ravi Fueling Communal Differences in TDP | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చ.. ఆ ఇద్దరే కారణం

Published Fri, Sep 30 2022 7:10 AM | Last Updated on Fri, Sep 30 2022 7:24 AM

Vasu, Btech Ravi Fueling Communal Differences in TDP - Sakshi

బీటెక్‌ రవి, వాసు

సాక్షి, కడప: ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ క్యాడర్‌లోనూ వారి పెత్తనం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఏకమై సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఏకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి (వాసు), పులివెందులకు చెందిన బీటెక్‌ రవిలు పార్టీలో మితిమీరిన జోక్యంతో టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి.

పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జిలను కాదని సదరు నేతలు వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య  విభేదాలు నెలకొన్నాయి. వాసు, బీటెక్‌ల ప్రోత్సాహంతో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు నియోజకవర్గాల పరి«ధిలోని రెండవ శ్రేణి నేతలు ఇన్‌చార్జిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ఇన్‌చార్జిలను కాదని ఈసారి ఎన్నికల్లో మీకే టిక్కెట్లు అంటూ ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతమున్న ఇన్‌చార్జిలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.  

►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈసారి కూడా తనకే టిక్కెట్‌ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ తనకేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాసు, బీటెక్‌ రవిలు పుట్టాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పుట్టా వర్గం ఆరోపిస్తోంది.  

►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతోనూ వాసు, బీటెక్‌ రవిలకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయమ్మ తనయుడు నితేష్‌కుమార్‌రెడ్డి వాసు వ్యవహార శైలిని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది.

►ఇక రాజంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చెంగల్రాయులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో వాసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అక్కడున్న కొందరు నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇక్కడ కూడా వాసు మితిమీరిన జోక్యంతోనే ఆ పరిస్థితి తలెత్తినట్లు సొంత పార్టీలోనే ప్రచారం సాగుతోంది. 

►కడప నియోజకవర్గంలోనూ వాసు జోక్యంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా వాసు పోటీలో ఉంటారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే కడప అసెంబ్లీ స్థానం నుంచి మైనార్టీలను కాదని ఈసారి ఎన్నికల్లో తన సతీమణిని నిలబెట్టాలని వాసు ఉద్దేశంగా కనబడుతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్న ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు తదితరులు వాసు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

►పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాసు, అటు బీటెక్‌ రవిలు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, నితీష్‌కుమార్‌రెడ్డి తదితరులు చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మితిమీరిన జోక్యంతోనే జిల్లాలో అరకొరగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. 

►ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీమంత్రి పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌తోపాటు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. రాంప్రసాద్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలిశారు. అయితే వాసు స్వయాన సోద రుడైన రమేష్‌రెడ్డి సైతం టిక్కెట్‌ రేసులో ఉన్నారు. వాసు, బీటెక్‌లు రమేష్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది.  

►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఆయన టిక్కెట్‌ తనకేనంటూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్‌ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఈ దఫా ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్‌ వస్తుందని వరదరాజులరెడ్డి వర్గం సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పొలిట్‌బ్యూరో సభ్యులు వాసు, బీటెక్‌ రవిలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్‌ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.  

►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి  రాబోయే ఎన్నికల్లో  టిక్కెట్‌ లభిస్తుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అభ్యర్థి తమ నేతేనని వీరశివారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. దీని వెనుక వాసు, బీటెక్‌ రవి జోక్యం ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement