రేపు ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు
ముగిసిన ప్రచారం
ఓటు హక్కు వినియోగించుకోనున్న
3,450 మంది
కాకినాడ సిటీ : ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల్లో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలోని తొమ్మిది డిపోల్లో జరిగే పోలింగ్‌కు కార్మిక శాఖ అధికారులు పోలింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎక్కడికక్కడే స్థానికంగా ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. జిల్లావ్యాప్తంగా 3,450 మంది ఆర్టీసీ కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా నెల రోజులుగా డిపోల్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది.
డిపోలవారీగా ఓటర్ల వివరాలు
జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఓటర్ల వివరాలు.. కాకినాడలో 611, రాజమహేంద్రవరం 614, అమలాపురం 540, తుని 331, ఏలేశ్వరం 265, గోకవరం 287, రామచంద్రపురం 284, రావులపాలెం 290, రాజోలు డిపోలో 228 మంది ఓటర్లు ఉన్నారు.
రెండు ఓట్లు వేయాలి
గుర్తింపు సంఘ ఎన్నికలో ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాజ్-6 పేరుతో ఉన్న పింక్ బ్యాలెట్ పేపర్‌పై జిల్లా గుర్తింపు సంఘానికి, క్లాజ్-3 పేరుతో ఉన్న వైట్ బ్యాలెట్ పేపర్‌పై రాష్ట్ర గుర్తింపు సంఘానికి ఓటు వేయాలి.
బరిలో నిలిచిన సంఘాలు
గుర్తింపు సంఘ ఎన్నికల బరిలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యుైనెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ ఉన్నాయి.