ఆర్టీసీ ఎన్నికలకు రెడీ!
4946 మంది ఓటర్లు 11 చోట్ల పోలింగ్ కేంద్రాలు బరిలో 8 యూనియన్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న జరిగే ఈ ఎన్నికలకు ఎనిమిది యూనియన్లు పోటీ పడుతున్నాయి. విశాఖ రీజియన్ పరిధిలో పది డిపోల్లోనూ, విశాఖ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మరొకటి వెరసి 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రీజియన్ వ్యాప్తంగా 4946 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు ఒకటి రీజియన్‌కు, మరొకటి రాష్ట్ర యూనియన్‌కు ఓటేయాల్సి ఉంటుంది. రాష్ట్ర యూనియన్‌కు తెలుపు, రీజియన్ యూనియన్‌కు గులాబీ రంగు బ్యాలెట్లు ఇస్తారు. పోలింగ్ ముగిసాక అదే రోజు ఓట్ల లెక్కింపు ఉన్నా ఫలితాన్ని ఆ రోజు వెల్లడించరు. ఎందుకంటే ఈ నెల 24న పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే 18వ తేదీన ఫలితాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా అనధికారికంగా ఏ యూనియన్ విజయం సాధించిందో తెలిసిపోతుంది. ఒకవేళ స్వల్ప ఓట్ల తేడా వస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలను డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో ఎన్‌ఎంయూ, రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్లు గుర్తింపు యూనియన్‌లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం యూనియన్‌లకు కేటాయించిన గుర్తులకే ఓటేస్తారు. గెలిచిన అనంతరం ఆయా యూనియన్లు రీజియన్, డిపోల వారీగా కార్యవర్గాన్ని నియమిస్తాయి.
ముగిసిన ప్రచారం: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. కొద్దిరోజులుగా బరిలో నిలిచిన వివిధ యూనియన్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. పలు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాయి. తమ యూనియన్‌ను గెలిపిస్తే చేయబోయే మేళ్లను, ప్రత్యర్థి యూనియన్ల వైఫల్యాలను వివరించాయి.
గత ంకంటే తగ్గిన ఓట్లు: వాస్తవానికి ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పదవీకాలం రెండేళ్లుంటుంది. గత ఏడాదితో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గత సంవత్సరం ఈ ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లు గడిచిపోయింది. ఈసారి ఎన్నికల్లో గతంకంటే దాదాపు వెయ్యి ఓట్లు తగ్గాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో దాదాపు ఆరు వేల ఓట్లుండేవి. ఈ రీజియన్‌లో 108 బస్సుల (సిటీలో 76, జిల్లాలో 32) ను తొలగించారు. ఒక్కో బస్సుకు సగటున 7.6 మంది సిబ్బంది ఉంటారు.
దీంతో ఈ బస్సుల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదించేయడం ఓట్ల సంఖ్య తగ్గడానికి కారణమని కార్మిక నాయకులు చెబుతున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 95 శాతానికి పైగానే ఓట్లు పోలవుతాయని వీరు అంచనా వేస్తున్నారు. మరోవైపు రీజియన్‌లో అత్యధికంగా వాల్తేరులో 776 ఓట్లు, పాడేరులో అత్యల్పంగా 183 ఓట్లు ఉన్నాయి.
ఏ యూనియన్‌కు ఏ గుర్తు?
గుర్తింపు యూనియన్ ఎన్నికల బరిలో నిలిచిన యూనియన్లకు గుర్తులను కేటాయించారు. అవి బ్యాలెట్ పత్రంలో వరస క్రమంలో ఇలా ఉన్నాయి.
1) ఏపీఎస్‌ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎగిరే పావురం
2) ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్సు
3) ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్ బస్సు టైరు
4) ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్ కార్మికుని పిడికిలి
5) ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కాగడా
6) ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నక్షత్రం
7) ఏపీఎస్‌ఆర్టీసీ యునెటైడ్ వర్కర్స్ యూనియన్ స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్
8) వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాన్