
వించిపేట(విజయవాడ పశ్చిమ): పురుషులకు దీటుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ సరిలేరు మాకెవ్వరు అంటూ నిరూపిస్తున్నారు విజయవాడ రైల్వే డివిజన్‌లోని మహిళా ఉద్యోగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్‌లో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ డివిజన్‌లో తొలిసారిగా పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) రైలును నడిపారు. శుక్రవారం విజయవాడలో సిబ్బంది విధులు మారారు. లోకో పైలట్, గార్డు, టీటీఈ, స్క్వాడ్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, పాయింట్ ఉమెన్, స్టేషన్ మాస్టర్ తదితర విభాగాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తించారు.
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో లోకో పైలెట్ కె.శాంతి
ఈ రైలులో విధుల్లో పాల్గొన్న లోకో పైలెట్ కె.శాంతి, గార్డు ఎల్.రాధ, ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యామల, ఎస్.శివకుమారి, ధనకుమారి, సీటీఐలు కె.కృష్ణవేణి, ఉమామహేశ్వరి, అరుణకుమారి, నాగలక్ష్మి, చందురాధిక, కె.ఎల్. ప్రసన్న తదితరులను డీఆర్‌ఎం పి.శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ డివిజన్‌లో తొలిసారిగా ఈ అరుదైన ఘనత సాధించడం తమకు గర్వకారణమని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా విధుల్లో ప్రతిభ చాటుతున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నస్రత్ ఎం మండ్రూప్‌కర్, ఎస్‌ఎం సునైనా, పాయింట్స్ ఉమెన్ నజ్మా విజయవాడలో జెండా ఊపి, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు.
గార్డుగా విధుల్లో రాధ
Comments
Please login to add a commentAdd a comment