మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చిత్రంలో సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్, మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: ఏపీకి తరలివచ్చే వలస కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు వైద్య సహాయం అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైన అనంతరం మంత్రి కన్నబాబు, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్‌లతో కలిసి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు.
► రాష్ట్రానికి చెందిన వలస కూలీలను రప్పించేందుకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే చెప్పారు. వేరే రాష్ట్రాల వారిని కూడా ఏపీ నుంచి సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, విద్యార్థులను కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించి రప్పించేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తాం.
► రాత్రివేళ పంట ఉత్పత్తులను వాహనాల్లో మార్కెట్‌కు తరలించే రైతులను పోలీసులు అడ్డుకోకుండా అనుమతించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించినట్టు మంత్రి కన్నబాబు చెప్పారు.
► అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మార్కెట్‌కు వస్తున్న మామిడి, బత్తాయిని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. వ్యవసాయ అధికారులు, సిబ్బందికి కోవిడ్ విధుల నుంచి మినహాయింపు కల్పించటంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.
► మంత్రుల బృందం సమావేశంలో హోంశాఖ మంత్రి సుచరిత, సీఎంవో సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.జవహర్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్, అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, వ్యవసాయ,సహకార శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
మద్యం షాక్ కొడుతుందని ముందే చెప్పాం
కరోనా విపత్కర పరిస్థితి తొలగే వరకైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఆపాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబు పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ఏర్పాటుకు కారకుడని విమర్శించారు. షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచుతామని వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment