రోడ్డు టెండర్లు మళ్లీ అ‘ధర’హో!
‘ఎక్సెస్’కు అవకాశం ఉండే నిబంధన తిరిగి అమలులోకి
నిర్మాణ ప్రదేశం నుంచి 70 కి.మీ.లో హాట్‌మిక్స్ ప్లాంటు ఉన్నవారికే పనులు
వై.ఎస్. సర్కారు తొలగించిన నిబంధనను తిరిగితెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
కొత్త నిర్ణయం వెనక కుమ్మక్కు ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు టెండర్లు ఇకపై అ‘ధర’హో అనిపించనున్నాయి. ఈ టెండర్లలో ‘ఎక్సెస్’కు అవకాశం ఉండే నిబంధనను తిరిగి అమల్లోకితెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 5 కోట్ల విలువైన పనులు చేపట్టే రోడ్డు కాంట్రాక్టర్‌కు ఆ పనులు చేసే చోటు నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో హాట్‌మిక్స్ (తారు సిద్ధం చేసేది) ప్లాంట్ ఉండాలనే నిబంధనను తిరిగి విధించింది. గతంలో ఈ నిబంధన అమలులో ఉన్నప్పుడు... 70 కిలీమీటర్ల పరిధిలో హాట్‌మిక్స్ ఉన్న కాంట్రాక్టర్లు తక్కువగా ఉండటంతో ఒకరిద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొంటూ అంచనాకు మించి (ఎక్సెస్) కోట్ చేసేవారు. దీంతో ప్రజాధనం వృథా అవుతుండటంతో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిబంధనలను మార్చింది. టెండర్లలో పోటీతత్వం వస్తే ఎక్సెస్‌కు కోట్ చేసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఈ నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ హాట్‌మిక్స్ ప్లాంట్ ఉన్నవారైనా టెండర్లలో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
ఫలితంగా పోటీతత్వం పెరిగి చాలాచోట్ల 10 శాతం లెస్ (తక్కువ)కు కోట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు అమలవుతున్న ఈ పద్ధతిని ఉన్నట్టుండి ప్రభుత్వం మార్చడం వెనక కొందరు కాంట్రాక్టర్లతో ఉన్నతాధికారులు, నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్య వల్ల మళ్లీ రోడ్ల పనుల టెండర్లను బడా కాంట్రాక్టర్లు కనీసం 10 శాతం ఎక్సెస్‌కు దక్కించుకునేందుకు మార్గం సుగమం చేసినట్లు అయిందని సమాచారం. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై కనీసం ఏటా రూ.750 కోట్ల భారం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం రూ.5 కోట్ల విలువైన పనులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, అంతకంటే ఎక్కువ విలువైన పనులకు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. బిల్డర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇద్దరు ఈఎన్‌సీలు, ఇద్దరు చీఫ్ ఇంజినీర్లతో కూడిన కమిటీ చేసిన సిఫారసును పరిగణనలోకి తీసుకునే ఈ చర్య చేపట్టినట్లు వివరించింది.