
ఆమదాలవలసకు కమిషనర్ సెలవ్!
ఆమదాలవలస:జిల్లాలో అధికార యంత్రాంగంపై అధికార పార్టీ ఒత్తిళ్లు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. దీనివల్ల ప్రశాంతంగా విధులు నిర్వహించలేక పలువురు పలాయన మంత్రం పఠిస్తున్నారు. ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ ఉదంతమే దీనికి నిదర్శనం. మున్సిపల్ కమిషనర్ ఎన్.నూకేశ్వరరావు సెలవుపై వెళ్లిపోయారు. ఆయన 15 రోజులు మెడికల్ లీవ్ పెట్టినప్పటికీ.. ఇక తిరిగి రారని తెలుస్తోంది. తాను నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేయడం, ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డును కూడా వాపసు ఇచ్చేయడం తిరిగి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి వ్యక్తిగత వినతిపైనే ఆయన ఆమదాలవలస కమిషనర్‌గా వచ్చారు.
గతంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-2 మేనేజర్‌గా పని చేసిన ఆయన అక్కడి నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గ్రేడ్-1 మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఆమదాలవలస కమిషనర్ పోస్టు ఖాళీ కావడంతో వ్యక్తిగత వినతి పెట్టుకుని గత ఏడాది జూన్‌లో ఇక్కడికి వచ్చారు. ఏడాదిపాటు చక్కగా విధులు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి పాలకవర్గం ఏర్పాటు చేయడంతో కష్టాలు మొదలయ్యాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. టీడీపీ పట్టణ, నియోజకవర్గ నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి తాము చెప్పినట్లు చేయాలని పీక మీక కత్తి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక కూరగాయల మార్కెట్ కూల్చివేత వివాదం ఈ ఒత్తిళ్లకు పరాకాష్టగా మారింది. కౌన్సిల్ తీర్మానం లేకుండా, వర్తకులకు నోటీసులు ఇవ్వకండా, కొందరు హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి కూరగాయల మార్కెట్‌ను కూలగొట్టించే విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. దీనికితోడు మున్సిపాలిటీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఈ విషయంలో వర్తకుల పక్షాన నిలిచి తీవ్ర ప్రతిఘటించడంతోపాటు కమిషనర్‌ను పలుమార్లు నిలదీసింది.
ఈ ఉదంతంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దీంతో ఇరకాటంలో పడిన కమిషనర్ ఈ పరిస్థితుల్లో ఇక్కడ పని చేయలేనని భావించి, సెలవు పేరుతో వెళ్లిపోయారు. ప్రస్తుతం శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోలారావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా కమిషనర్‌గా తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది.