అంచనాకు అందని నష్టం | amage estimates are not available | Sakshi
Sakshi News home page

అంచనాకు అందని నష్టం

Published Wed, Oct 15 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

అంచనాకు అందని నష్టం

అంచనాకు అందని నష్టం

నష్టంపై శాఖల వారీ సర్వే
రాత్రికల్లా విశాఖకు మళ్లీ కరెంటు
సామాజిక బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు  ఆర్థికసాయం చేయండి
విశాఖ కలెక్టరేట్‌లో  ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి


‘‘అంచనాకు అందని నష్టమిది. ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం. తుపాను నష్టంపై శాఖల వారీగా సర్వే జరుగుతుంది. రేపటికల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. విశాఖ నేవీ రంగానికే రూ.2 వేల కోట్ల నష్టం కనిపిస్తోంది. స్టీల్‌ప్లాంటు కూడా బాగా దెబ్బతింది. ఎవ్వరూ అధైర్యపడొద్దు. సమన్వయంతో జరిగిన నష్టం నుంచి బయటపడదాం’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ధైర్యం చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగ ళవారం ఉదయం 11 గంటలకు అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి తుపాను సహాయ చర్యలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖ నగరానికి అనుకోని కష్టం వచ్చింది. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతగిలింది. ప్రపంచంలో ఎక్కడా నేరుగా నగరాన్ని దెబ్బతీసిన తుపానుల గురించి వినలేదు. ఇదే మొదటిది. నేవీ రంగానికి రూ.2 వేల కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీకి రూ.300 కోట్లు, స్టీల్‌ప్లాంట్‌కు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది. స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తి పడిపోవడంవల్ల రోజుకు రూ 30 నుంచి 40 కోట్ల నష్టం కనిపిస్తోంది. ఫర్నేస్‌లు పనిచేయడం నిలిచిపోతే ఈ నష్టం మరింత పెరిగే ప్రమాదముంది. ఈ లోగానే పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. ప్రయివేటు పరిశ్రమలు లాభాల కోసమే పనిచేయడంమాని మానవత్వంతో సహాయక చర్యలకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆ విధంగా ముందుకురాని సంస్థలు, పరిశ్రమలపై చర్యలు తప్పవన్నారు. సహాయక చర్యల విధులకు రాకపోతే అవసరాన్ని బట్టి అరెస్టులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో టెలికాం ఉద్యోగులు విఫలమయ్యారనీ, అదేవిధంగా సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఆపరేటర్లు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని మండిపడ్డారు. సెల్ టవర్లు నిర్విరామంగా పనిచేసేందుకు వీలుగా డీజిల్ కూడా సిద్ధం చేసుకోలేని స్థితిలో ఆపరేటర్లు ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సాయంత్రానికి విద్యుత్ సరఫరా...

 విశాఖ నగరంలో మంగళవారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అదనంగా విద్యుత్ సిబ్బందిని, ట్రాన్స్‌ఫార్మర్లను తెప్పించి ఇక్కడి ఫీడర్లకు కలపనున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో డిమాండుకు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. బయట ప్రాంతాల నుంచి నిర్వాసితుల కోసం వచ్చే ఆహార పదార్థాలు, తాగునీటిని లూటీ చేయవద్దని హితవు చెప్పారు. అందరికీ సమృద్ధిగా ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాల కృత్రిమ కొరత తలెత్తకుండా అందరూ సహకరించాలని కోరారు. పాలు, కూరగాయలను అధిక మొత్తంలో తెప్పిస్తున్నామని తెలిపారు. నగరంలో సాయంత్రానికి పెట్రోలు కొరత తీరుతుందని, ఇన్సూరెన్సు కంపెనీలు సాధ్యమైనంత త్వరగా ఆదుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి నిర్వాసితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. యువత శ్రమదానం ద్వారా నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు సహకరించాలన్నారు. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధమయ్యేవరకూ హైదరాబాద్ వెళ్లేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement