
సాక్షి,అమరావతిబ్యూరో/అమరావతి: రానున్న కాలంలో రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దటమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని, రాజధాని ప్రాంతంలోనే 15 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం జరిగిన గురుపూజోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని, తల్లిదండ్రుల తర్వాత గురువులనే గుర్తు పెట్టుకోవాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని టీచర్లు ముందుకు సాగాలన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది రూ. 23 వేల కోట్లు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.
సింధుపై పొగడ్తల వర్షం: ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన సింధును ఎలా గౌరవించాలో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తామని చంద్రబాబు అన్నారు. కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. తన హయాంలోనే గోపీచంద్ ఏర్పాటు చేసిన అకాడమీకి సహకరించానని, దానివల్లే సి«ంధులాంటి గొప్ప క్రీడాకారిణి రాష్ట్రానికి దక్కిందన్నారు. కాగా, బ్యాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.
బోధనాసిబ్బంది వేతనం పెంపు: మంత్రి నక్కా
గురుపూజోత్సవం సందర్భంగా గురుకులాల్లో పార్ట్‌టైం స్కేల్‌పై పనిచేస్తున్న లెక్చరర్లు, టీచర్ల జీతాలు పెంతున్నట్లు మంత్రి నక్కా ఆనంద్‌బాబు ప్రకటించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్ లెక్చరర్ జీతం రూ. 8500 నుంచి రూ. 18000, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ జీతం రూ. 7500నుంచి రూ. 16,100, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జీతం రూ. 7,500నుంచి రూ. 14,800, పీఈటీ జీతం రూ. 6,500నుంచి రూ. 10,900, స్టాఫ్ నర్స్ జీతం రూ. 6,500 నుంచి రూ. 12,900లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
అవార్డుల ప్రదానంలో గందరగోళం
రాష్ట్రంలోని వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఉపాధ్యాయులు, అ«ధ్యాపకులు, ప్రొఫెసర్లుగా ఎంపికైన 158 మందికి సీఎం చంద్రబాబు అవార్డులు ప్రదానం చేశారు. ముందుగా కొద్ది మందికే అవార్డులు ప్రదానం చేసి సీఎం ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు స్టేజీ దిగుతుండగా.. పలువురు ఉపాధ్యాయులు అందరికీ అవార్డులు ప్రదానం చేయాలంటూ గట్టిగా కేకలు వేయడంతో అందరికీ అవార్డులు ప్రదానం చేయాల్సి వచ్చింది. అవార్డుల ప్రదానంలో గందరగోళం మధ్య ఎవరికి వారు స్టేజీ పైకి వెళ్లి అవార్డులు తీసుకున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుతో పాటు ట్యాబ్ పంపిణీ చేయడంతో పలువురు ఉపాధ్యాయులు రెండు, మూడు పర్యాయాలు స్టేజీ పైకి వెళ్లి ట్యాబ్‌లు తీసుకోవడం గందరగోళం సృష్టించింది. చాలా మందికి ట్యాబ్‌లు లేకపోవడంతో అధికారులు ట్యాబ్‌లు తీసుకున్న వారి చేతిలోనుంచి తీసుకొని అవార్డులు పొందేవారికి ఇప్పించడం విమర్శలకు తావిచ్చింది. చివరిదశలో ట్యాబ్‌లు చాలకపోవడంతో పలువురికి ఇవ్వలేకపోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ , ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment