సీఆర్‌డీఏ అధికారులను నిలదీస్తున్న రాజధాని రైతు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రస్తుతం ఎకరం రూ.6 కోట్ల నుంచి రూ. 10 కోట్ల దాకా పలికే ప్రాంతంలో విలువైన తమ భూములు తీసుకుని ఎకరాకు రూ.39 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నించారు. భూ సేకరణ నోటీసులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం ఉండవల్లికి వచ్చిన సీఆర్‌డీఏ అధికారులను రైతులు పలు ప్రశ్నలతో నిలదీయటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తమకు సమాధానం చెప్పాలని లేదంటే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రైతులంతా పట్టుబట్టారు.
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: గజానికి రూ. 4,400 చొప్పున ధర నిర్ణయించామని, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్ కలిపితే గజానికి రూ.5,500 వస్తుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రజనీకుమారి రైతులకు చెప్పారు. ఈ మొత్తానికి భూ సేకరణ చట్టం 2013 ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం రూ.50 వేలు పలుకుతుంటే రూ.5 వేలు ఇస్తామనడం ఏమిటని రైతులు మండిపడ్డారు. సెక్షన్ 21(5) ప్రకారం నోటీసులు తీసుకోని రైతుల వివరాలతో పత్రికల్లో ప్రకటన ఇచ్చిన 30 రోజుల తర్వాత అవార్డు ఎంక్వైరీ చేపట్టాలన్నారు. సెక్షన్ 19(1) ప్రకారం రూఢీ ప్రకటనకు ముందే రైతులకు అందజేసే పరిహారాన్ని కలెక్టర్ ఖాతాకు ప్రభుత్వం జమ చేసి ఉండాలని పేర్కొన్నారు. రైతులు న్యాయపరమైన అంశాలతో నిలదీయటంతో సమాధానం చెప్పలేక అధికారులు తెల్లబోయారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు సహకరిస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు.
బాబు తాతనైనా ఎదిరిస్తాం: మా భూముల జోలికొస్తే చంద్రబాబునే కాదు.. ఆయన తాతనైనా ప్రశ్నిస్తామని రాజధాని రైతులు హెచ్చరించారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఎదిరిస్తామని స్పష్టం చేశారు. తమ భూములకు పరిహారం ఎప్పుడు, ఎంత జమ చేశారో చెప్పాలన్నారు.
సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్న రైతులు: తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు భూసేకరణ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు అభ్యంతరాలుంటే గ్రామంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో తెలపాలని సూచించారు. దీంతో సుమారు 60 మంది రైతులు బుధవారం కార్యాలయానికి చేరుకుని భూములపై తమ అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలంటూ నిలదీశారు. కాగా, భూ సేకరణ చట్టం సెక్షన్ 12, 20ల ప్రకారం సీఆర్‌డీఏ అధికారులు చేసిన సర్వే అంతా బోగస్ అని ఇట్టే తెలిసిపోతోందని అడ్వకేట్ సీహెచ్ నిర్మలత తెలిపారు. ఉండవల్లి సెంటర్‌లో సర్వే నంబర్ 12(1సీ)లో మాడా పున్నారావుకు చెందిన మూడంతస్తుల భవనం ఉంటే అధికారులు అది ఖాళీ స్థలంగా చూపుతున్నారన్నారు. కృష్ణా కరకట్టకు ఉత్తరం వైపున ఇస్కాన్ ఆలయం నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఖాళీగా చూపిస్తున్నారని, సర్వే అంతా లోపభూయిష్టమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment