సాక్షి అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట మూడున్నరేళ్లుగా రూ.కోట్లు వెచ్చిస్తూ శంకుస్థాపనలు, ఈవెంట్లు, డిజైన్లతో కాలక్షేపం చేస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా అమరావతి సినిమాకు తెరతీశారు. రాజధాని భవనాల డిజైన్లంటూ ఏడాదిగా విదేశాల చుట్టూ చక్కర్లు కొడుతు న్న సీఎం మెదడులో సరికొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. రాజధాని భవనాల డిజైన్లపై బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళితో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రచారం కోసం సినిమా తీయడంపై బాబు తాజాగా ఆయనతో చర్చలు ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో డిజైన్ల అంశం కంటే అమరావతి సినిమాపైనే సీఎం చర్చించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రాజమౌళి తోపాటు ఆయన కుమారుడు కార్తికేయ కూడా పాల్గొనడం గమనా ర్హం. కార్తికేయకు ప్రకటనల సంస్థ ఉందని, దానిద్వారా సినిమా నిర్మించాలని సీఎం భావిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శాశ్వత నిర్మాణాలు లేకుండానే ...
ముఖ్యమంత్రితో రాజమౌళి, ఆయన కుమారుడు సమావేశమైన తరువాత సినీ పరిశ్రమలో రాజధాని అమరావతి సినిమాపై చర్చ సాగుతోంది. సినిమా నిడివి ఎన్ని గంటలు? ఏ తరహాలో తీయాలనే అంశంపైనా చర్చించినట్లు సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా దర్శకత్వ బాధ్యతలను రాజమౌళికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సీఎం చంద్రబాబుతోపాటు రాష్ట్ర మంత్రి పి.నారాయణ కూడా కనిపిస్తారని తెలుస్తోం ది. రాజధానిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండానే అమరావతి సినిమా ఎలా తీస్తారనే సందేహాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి గత చరిత్రతోపాటు వనరుల లభ్యత తదితర వివరాలతో ప్రచారం కోసం సినిమా తీయనున్నారు. ఈ సినిమాను దేశ, విదేశాల్లో ప్రదర్శిస్తారని, ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment