గుంటూరు: పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేయటం ప్రజాస్వామ్యంలో సరి అయిన పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను శాంతియుతంగా ఎత్తిచూపుతూ పోరాడుతున్న వారిపై దౌర్జన్యంగా, దారుణంగా కేసులు పెట్టించి అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు విలేకర్లతో మాట్లాడారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, బందరు మాజీ శాసనసభ్యుడు పేర్ని నానిలను అన్యాయంగా అరెస్ట్ చేసి వైఎస్సార్ సీపీని భయపెట్టేందుకు పథకం ప్రకారం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను చిత్రహింసలు పెట్టాలని, మానసికంగా కుంగదీయాలని చంద్రబాబు సర్కార్ పోలీసు వ్యవస్థను వినియోగించి దుర్మార్గాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు తీరు ప్రమాదకర సంకేతాలను సమాజానికి ఇస్తోందన్నారు.
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని కేవలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ పెట్టడం వలనే, ఆ ఇంటి యజమానికి నాని మధ్య వివాదం జరిగిందన్నారు. సక్రమంగా అద్దె చెల్లిస్తూ.. యజమానికి ఖాళీ చేస్తామని నాని చెబుతున్నా, సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఇంటి యజమానికి బంధువు కావటంతోనే 500 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేయించారని మండిపడ్డారు. చట్టప్రకారం కాకుండా కేవలం భువనేశ్వరి చెప్పిందని రాజ్యాంగాన్ని వారే రాసుకున్న చందంగా పోలీసులు వ్యవహరించటం సబబుకాదన్నారు.
పోలీసులు ప్రమాదకర పద్ధతులను మానుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీకి అనూకూలంగా ఉన్న వైన్‌షాపులపై దాడులు చేయించి అన్యాయంగా కేసులు పెడుతుండటంతో ఎదురు తిరిగిన పేర్ని నానిపై కేసు పెట్టించారన్నారు. రైతుల పక్షాన నిలబడి భూములు లాక్కోకుండా అడ్డుపడుతున్నారనే ఆయన్ని అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్యమంత్రి మరోసారి పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, మరింత రాటుతేలి పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు.
'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'
Published Tue, Nov 17 2015 8:28 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
Advertisement