
'జపాన్ పర్యటనకు వెళ్లి బాబు ఏం తెచ్చారో చెప్పాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు 398 తేవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ ఈ జీవోను విడుదల చేయడంపై వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ లాంటి నిరంకుశపాలనలో కూడా ఇలాంటి జీవోలు ఇవ్వరని అంబటి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 398 జీవోతో ఏపీలో భూ కుంభకోణాలకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు వ్యతిరేకి అని చెప్పడానికి ఈ జీవోనే తాజా తార్కాణమని ఆయన విమర్శించారు. తన తాబేదారులకు మేలు చేయడానికే చంద్రబాబు జీవో తెచ్చారన్నారు.
జపాన్ పర్యటనకు వెళ్లి బాబు ఏం తెచ్చారో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. ఆయనతో జపాన్ కు వెళ్లిన నాయకులందరికీ అక్కడ వ్యాపారులున్నాయన్నారు. చంద్రబాబు విదేశీ టూర్ల ప్రచారం బారెడు- పని జానెడులా ఉందని విమర్శించారు. ఆయన విదేశీ టూర్లు ఆపి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. భూములు ఇవ్వకపోతే రాజధాని తరలిపోతుందనడం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తగదని అంబటి తెలిపారు.