మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి, వేదికపై పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు, బొల్లా బ్రహ్మనాయుడు, సయ్యద్ మాబు, కావటి మనోహర్
గుంటూరు, నరసరావుపేట రూరల్: ముస్లింలను ఓటు అడిగే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఆదిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం రాత్రి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ మైనార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్యయకర్త కాసు మహేష్‌రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్యయకర్త బొల్లా బ్రహ్మనాయడు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్‌మాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. మంత్రి పదవులు ఇస్తానని వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీడీపీలోకి చేర్చుకున్న చంద్రబాబు వారికి మొండిచెయ్యి చూపారని తెలిపారు. తాను బీజేపీని వదిలి కాంగ్రెస్‌తో కలిసానంటూ ముస్లింలను మభ్యపెట్టి ఓట్లు అడిగేందుకు చంద్రబాబు ముందుకు వస్తున్నాడని, పైగా బీజేపీతో జగన్ కలుస్తాడంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గత ఎన్నికల సమయంలోనే బీజేపీ ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించిందని, అయితే మతతత్వ పార్టీతో పొత్తుకు జగన్ అంగీకరించలేదని చెప్పారు. పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ పార్టీ అనుబంధ విభాగాల బలోపేతం చేయడానికి తరచూ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రతి కార్యకర్త తాను పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఏవిధంగా ఉపయోగపడగలనో ఆలోచించుకుని ఆ మేరకు కృషిచేయాలని సూచించారు.
గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ లేదా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ముస్లింలకు కేటాయిస్తామని ప్రకటించారు. వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మైనార్టీ నాయకులు వారి సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ ఊసరవెల్లి తన రంగు మార్చుకోవడానికి 11రోజుల సమయం పడుతుందని, చంద్రబాబు మాత్రం 11 నిమిషాల్లోనే పార్టీలను మార్చుతాడని ఎద్దేవా చేశారు. జగనన్నతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment