
కన్నీళ్లు పెట్టినా పట్టించుకోరా?
ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు కక్ష కట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
గుంటూరు: ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు కక్ష కట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనకుండా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రోజా పట్ల పనిగట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సదస్సుకు ఆహ్వానించి అడ్డగించి అవమానపరుస్తారా అని ప్రశ్నించారు. మీరు తప్పుచేస్తే తప్పని చెప్పకూడదా అని నిలదీశారు.
టీడీపీ హాయాంలో మహిళలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నారని వాపోయారు. మంత్రి తనను వేధిస్తున్నారని జడ్పీ చైర్ పర్సన్ కన్నీళ్లు పెట్టినా పట్టించుకోరా అని సూటిగా ప్రశ్నించారు. ‘మీ అరాచకాలను పట్టించుకోవద్దా.. మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అమ్ముడు పోయినట్టా. మీడియా మీకు అమ్ముడు పోలేదని అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రచారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. పత్రికలపై ఆయన మాట్లాడిన తీరు సరికాద’ని అంబటి రాంబాబు అన్నారు. దేశంలో ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టించగల శక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. మహిళా సాధికారత పెంచే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు.