కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. హైదరాబాదు నుంచి శుక్రవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల పేర్ల నమోదు, తొలగింపు, పేరు, అడ్రసు మార్పు అంశాలపై దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికీ ఒక ఈఆర్వోను నియమించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలను విశ్లేషించి వయసును బట్టి గ్రూపులు, మగ, ఆడ నిష్పత్తిని నిర్ణయించాలన్నారు.
2011 డేటాను వీటికి ఆధారంగా తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లను ఎన్నికల శిక్షణ కోసం ప్రతిపాదించాలని చెప్పారు. రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్లను కూడా శిక్షణ కోసం ప్రతిపాదించవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది అందరూ ఓటరుగా నమోదై ఉండాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ఈవీఎం గోడౌన్ల నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు.
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సమరీ రివిజన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ వివరాలను వివరించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి 2,300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు, మూడు రోజుల్లో వీటిని పరిష్కరించనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు పంపించామన్నారు. 39 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, ఉడా వీసీ రామారావు, భూసేకరణ స్పెషల్ ఆఫీసర్ రమేష్‌కుమార్, డీపీవో ఆనంద్, డీఆర్డీఏ పీడీ శివశంకర్, విజయవాడ, నూజివీడు సబ్‌కలెక్టర్లు దాసరి హరిచందన, చక్రధరరావు, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్‌సుందర్రావు, ఆర్డీవోలు సాయిబాబు, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ పూర్తిచేయాలి
Published Sat, Nov 2 2013 1:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement