నందవరం టు న్యూయార్క్
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: పుట్టుకలో లోపాలను వైద్యులు సరిదిద్దగా.. విధికి ఎదురొడ్డి నిలిచిన ఆ బాలికకు బంగారు భవిష్యత్తు ఆహ్వానం పలికింది. అమెరికాలోని రాస్ స్కూల్‌లో చదువుకునే అవకాశం దక్కడంతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించే అదృష్టం కూడా తలుపుతట్టింది. అయితే ఆమె జనన ధ్రువీకరణ పత్రం, తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం లేకపోవడం ఆమె ఉజ్వల భవిష్యత్తుకు అడ్డంకిగా మారింది. నందవరం గ్రామానికి చెందిన లోకన్న, జయలక్ష్మి దంపతుల కుమార్తె పద్మావతి. 1998లో ఈ బాలిక గ్రహణమొర్రితో జన్మించింది.
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు వైద్యం చేయించే స్థోమత లేక అలాగే వదిలేశారు. కొన్నిరోజులకు ఇలాంటి కూతురు, భార్య తనకు వద్దంటూ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లి జయలక్ష్మి, మేనమామ దస్తగిరి వద్ద బాలిక పెరిగింది. 2001లో అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కర్నూలులో ఏర్పాటు చేసిన గ్రహణమొర్రి ఉచిత వైద్య శిబిరానికి పద్మావతిని తీసుకెళ్లాడు. అప్పట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ఫోర్ట్ సభ్యులు లయన్ నాగేశ్వరరావు, లయన్ శివశంకర్‌రెడ్డి, లయన్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, దంత వైద్యులు డాక్టర్ పి.సునీల్‌కుమార్‌రెడ్డి చేయూతనందించారు.
అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని జీఎస్‌ఆర్ హాస్పిటల్‌లో డాక్టర్ గోస్లా శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైద్య సేవలు మొదలయ్యాయి. పన్నెండేళ్ల పాటు పద్మావతికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ క్లెఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో క్లెఫ్ట్ కిండర్ హిల్ఫే షెవాజ్ క్లెఫ్ట్ స్కూల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువు చెప్పించారు. ప్రస్తుతం ఆ బాలిక మంచి మార్కులతో 8వ తరగతి పూర్తి చేసింది.
కుందనపు బొమ్మగా మార్చిన వైద్యులు
జీఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడేళ్ల వయస్సున్న పద్మావతికి వైద్యులు మొదట హైపర్‌టిలోరిజం విధానం ద్వారా పెదవిని దగ్గరగా చేర్చే ఆపరేషన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అంగిళిలోని ఎముకను దగ్గరగా అతికించడం, నుదురును, కనుబొమ్మలను దగ్గరగా చేయడం, ముక్కును సరిచేయడం వంటి చికిత్సలన్నీ చేస్తూ వచ్చారు. అంగిళిలోని వైకల్యాన్ని రూపుమాపేందుకు పక్కటెముకలోని ఒక ఎముకను తీసి అతికించారు. ఇలా పన్నెండేళ్ల పాటు 8 నుంచి 12 సార్లు స్థానిక వైద్యులతో పాటు స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌కి చెందిన ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెసర్ హెర్మన్ సిలీర్ వంటి వారిచే శస్త్రచికిత్సలు నిర్వహించారు. వైద్యుల కృషి ఫలితంగా ఆ బాలిక అందంగా తయారైంది.
వీసా, పాస్‌పోర్ట్‌కు అడ్డంకులు
మూడేళ్ల వయస్సులోనే నందవరం వదిలి హైదరాబాద్‌కు వచ్చిన పద్మావతికి నేడు జనన ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా మారింది. అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి లోకన్న మరణ ధ్రువీకరణ పత్రం సైతం కుటుంబసభ్యులు తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె తల్లి జయలక్ష్మి సైతం అనారోగ్యంతో మంచంపట్టింది. దీంతో పద్మావతికి వీసా, పాస్‌పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. జూన్ 20వ తేదీలోపు అమెరికా వెళ్లాల్సిన ఆమెకు ఇప్పటి వరకు కనీసం పాస్‌పోర్ట్ కూడా రాలేదు. పాస్‌పోర్ట్ రావాలంటే తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. ప్రస్తుతం తండ్రి జీవించి లేకపోవడంతో ఆయన మరణ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంది. దీనికి తోడు పద్మావతి జనన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. జిల్లా అధికారులు స్పందించి అరుదైన ఈ బాలికకు ఈ పత్రాలన్నీ తక్కువ సమయంలో సమకూర్చగలిగితే ఆమె బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన వారవుతారని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమెరికాలో ఉన్నత చదువుకు అవకాశం
ప్రస్తుతం 8వ తరగతి పూర్తి చేసుకున్న పద్మావతికి ఉన్నత విద్యనందించాలని క్లెఫ్ట్ సొసైటీ వారు అమెరికాలోని రాస్ పాఠశాలకు లేఖ రాశారు. స్పందించిన రాస్ పాఠశాల నిర్వాహకులు బాలికకు పాఠశాల విద్యనే కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్యను సైతం ఉచితంగా అందిస్తామని పేర్కొంటూ క్లెఫ్ట్ సొసైటీకి లేఖ పంపారు. ప్రస్తుతం ఆమె ఉన్నతిని చూసి కుటుంబ సభ్యులతో పాటు వైద్య సేవలు అందించిన వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.