అందరు కాదు కొందరే
⇒ అమిత్‌షా సభకు ఎంపిక చేసిన నేతలకే ఆహ్వానం
⇒ 25న ఏపీలో పర్యటించనున్న అమిత్‌షా
⇒ సభ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యనేతల భేటీ- చర్చ
అమరావతి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనబోయే సభకు పార్టీ ముందుగా ఎంపిక చేసిన నేతలకే ఆహ్వానం పలకాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ బూత్ స్ధాయి కమిటీ సభ్యులతో భేటీ అయ్యేందుకు అమిత్ షా ఈ నెల 25వ తేదీన విజయవాడకు రానున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. కేంద్ర పార్టీ పరిశీలకులు సతీష్ జీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. హరిబాబు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరాజు, రాష్ట్ర మంత్రులు పి. మాణిక్యాలరావు, కె. శ్రీనివాస్, పార్టీ నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 42,165 వరకు పోలింగ్ బూత్‌లుండగా, అందులో దాదాపు 20 వేల పోలింగ్ బూత్‌లలో పార్టీ కమిటీ నిర్మాణం పూర్తయినట్టు ముఖ్య నేతలు చెబుతున్నారు. అమిత్‌షా పర్యటన నాటికి మరో నాలుగైదు వేల బూత్ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్టీ నిర్మాణం పూర్తయిన ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి ముగ్గురేసి నేతల చొప్పున అమిత్ షా సభకు ఆహ్వానం పంపుతారు. ఆహ్వానాలు పంపే వారికి రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ నగర సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని అమిత్ షా సభ నిర్వహణకు నాయకులు పరిశీలించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద సభ నిర్వహణకు నేతలు మొగ్గు చూపారు. విశాలమైన ఖాళీ ప్రదేశంలో భారీ స్థాయిలో తాత్కాలిక షెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బూత్ కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడనున్న అమిత్ షా:
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కొంత మంది బూత్ కమిటీ సభ్యులతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సభనుద్దేశించి జాతీయ అధ్యక్షుడు ప్రసంగించిన అనంతరం కొంత మంది సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తారు.