చిక్కిన సంచి | amma hastam Essential commodities cutting | Sakshi
Sakshi News home page

చిక్కిన సంచి

Published Sun, Mar 16 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

చిక్కిన సంచి

చిక్కిన సంచి

  •    అమ్మహస్తం సరుకుల్లో కోత
  •      తగ్గుతున్న నిత్యావసరాల కేటాయింపు
  •      సకాలంలో సరఫరా కాని వస్తువులు
  •      ఇబ్బందులు పడుతున్న కార్డుదారులు
  • సరకుల సంచి చిక్కిపోతోంది. నెలకో వస్తువు మాయమైపోతోంది. నిత్యావసర వస్తువుల కేటాయింపుల్లోనూ కోతపడుతోంది. ప్రస్తుతం సంచిలోని తొమ్మిది సరుకులు ఐదుకు కుదించుకు పోయాయి. మొత్తంగా అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా మారింది. నిత్యావసర సరకులు ఎప్పుడు వస్తాయో.. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని దుస్థితి. కొన్ని సరకులు నాణ్యంగా లేకపోవడం.. మరికొన్ని సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు.
     
     విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్‌కార్డుదారులకు రూ. 185కే 9 నిత్యావసర సరకులు అమ్మహస్తం పథకంలో అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతే ఏడాది ఏప్రిల్‌లో ఆర్భాటంగా ప్రారంభించింది. ఎన్నికల ప్రచారాస్త్రంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రభుత్వం కనీసం ఏడాది కూడా సక్రమంగా నడపలేక చేతులెత్తేసింది.

    ప్రారంభం నాటి నుంచి ఒక్క నెల కూడా సరకులను సక్రమంగా స కాలంలో జిల్లాకు కేటాయించలేదు. ప్రతీ నెలా ఏదో ఒక వస్తువు ఆలస్యంగానో లేదా తక్కువగానో కేటాయిస్తూ వచ్చింది. తాజాగా ఆ సరుకుల్లో కూడా కోత పెట్టింది. కారం, పసుపు,ఉప్పు,చింతపండు కేటాయింపులను పూర్తిగా నిలిపివేసింది.
     
    నాణ్యత లేక అయిష్టత : అమ్మహస్తం పథకంలో కొన్ని సరకులపై కార్డుదారులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటిని అసలు చౌక దుకాణాల నుంచి విడిపించడం లేదు. ప్రధానంగా ఉప్పు, గోదుమపిండి అధ్వానంగా ఉంటున్నాయి. వీటిపై కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. ఒక్కోసారి కందిపప్పు కూడా బాగుండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా జిల్లాకు నెలా నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. డిమాండ్‌ను బట్టి అధికారులు సరకుల ఇండెంట్‌ను పెడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ నెలా సరకులు మిగిలిపోతూనే ఉన్నాయి. ఈ సరకులు డీలర్లకు కూడా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు అవసరం మేరకు మాత్రమే పసుపు, కారం, చింతపండులను కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా వాటిని ఇవ్వడం మానేసింది. వీటి నిలుపుదలకు సంబంధించి అధికారుల వద్ద కూడా ఎటువంటి సమాచారం లేదు.

    సకాలంలో సరఫరా కాని సరకులు : మిగిలిన సరకులు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రతీ నెలా పంచదార, కందిపప్పు,పామాయిల్ కేటాయింపుల్లో కోత పడుతూనే ఉంది. అది కూడా ఒకేసారి జిల్లాకు రాకపోవడంతో కార్డుదారులు వాటి కోసం రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement