అమృత. ఎనిమిదేళ్ల చిన్నారి. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు,ఆదిలక్ష్మిల గారాలపట్టి. ముగ్గురు కూతుళ్ల తర్వాత జన్మించిన సంతానం కావడంతో పాపంటే ఆ దంపతులకు ప్రాణం. గ్రామంలోని ప్రయివేట్ పాఠశాలలో 3వ తరగతి పూర్తి చేసింది. టీవీలో వచ్చే యాడ్‌ను చూసి ‘నాన్నా.. ఎగ్జిబిషన్‌కు వెళ్దాం’ అని అడగ్గానే బేల్దారిగా పని చేస్తున్న రాజు ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యాడు. ఎగ్జిబిషన్‌లోని జెయింట్‌వీల్ సరదాలలో ఓలలాడిస్తుందనుకుంటే.. మృత్యువొడికి చేర్చిన తీరు ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
డబ్బు.. ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. అక్రమాలను సైతం సక్రమం చేసి పైచేయి సాధిస్తుంది. ఈ కోవలోనే వెనుకా ముందు ఆలోచించకుండా ఎగ్జిబిషన్‌కు అనుమతివ్వడం ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఇంతకాలం ఆ ప్రాంగణంలో అడుగుపెట్టని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు హడావుడి చేస్తున్న తీరు చూస్తే డబ్బు ఏ స్థాయిలో చక్రం తిప్పిందో అర్థమవుతోంది. ఎవరెంత తిన్నారు.. ఎవరు బాధ్యత వహిస్తారు.. ఎవరికి శిక్ష పడుతుందనే విషయం పక్కనపెడితే.. ఆ చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి పరిహారం చెల్లించేదెవరు? నియోజకవర్గ ఎమ్మెల్యేనా? పోలీసులా? మున్సిపల్ కమిషనరా? అగ్నిమాపక శాఖనా? స్థలాన్ని వేలం పెట్టిన జూనియర్ కళాశాల యాజమాన్యమా?
అనంతపురం సెంట్రల్/ఆత్మకూరు: నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రోబో ఎనిమల్ ఎగ్జిబిషన్ నిర్వహణలో అడుగడుగునా లోపాలే. అనుమతులు మొదలు.. నిర్వహణ వరకు నిబంధనలను తుంగలో తొక్కిన తీరు విస్మయం కలిగిస్తోంది. జూనియర్ కళాశాల మైదానాన్ని రెండు నెలలకు రూ.12లక్షలు చెల్లించేలా యాజమాన్యం వేలంలో కట్టబెట్టింది. అయితే నిర్వాహకులు సందర్శకుల రక్షణను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన చర్యలను గాలికొదిలేసింది. పెట్టిన పెట్టుబడి, లాభాలే ధ్యేయంగా ఎగ్జిబిషన్ నిర్వహణకు బరితెగించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశ(ఎంట్రీ ఫీజు) టిక్కెట్‌ను రూ.50 వసూలు చేయడంతోనే దందా మొదలయింది. ఇక ఎగ్జిబిషన్‌లో ఏది ముట్టుకున్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక సాధారణ కుటుంబం సరదా కోసమని లోనికి అడుగు పెడితే.. జేబుకు చిల్లుతోనిట్టూరుస్తూ ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నిబంధనలకు నీళ్లు
⇔ సెలవు రోజులు కావడంతో ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే వారి రక్షణార్థం ఇటు నిర్వాహకులు గానీ, అటు అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
⇔ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు రెండు మార్గాలు ఉండాలి.. కానీ ఇక్కడ ఒకే దారి. అందులోనూ ఇరుకుగా ఉంది. అందువల్లే ఆదివారం రాత్రి ప్రమాదం జరిగినప్పుడు కూడా „క్షతగాత్రులను తరలించడానికి దాదాపు అరగంట సమయం పట్టింది.
⇔ మంటలు ఆర్పేందుకు కార్బన్‌డయాక్సైడ్ సిలిండర్లు.. ఇసుకతో నింపిన బకెట్లు.. తగినంత నీరు అందుబాటులో ఉండాలి...ఇక్కడ మాత్రం అవేమీ కనిపించడం లేదు.
⇔ సందర్శకులు ప్రమాదాలు జరిగితే వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. అందువల్లే ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు రక్తస్రావం అవుతున్నా.. చున్నీలు చుట్టి ఆసుపత్రికి తరలించారు.
⇔ పోలీసుల కూడా ప్రజల రక్షణను పూర్తిగా విస్మరించి అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌లోకి ఎవరు వస్తున్నారు..? ఎవరు వెళ్తున్నారు..? ప్రజల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలేవి పట్టించుకోలేదు. కనీసం ఓ కానిస్టేబుల్‌ను కూడా అక్కడ నియమించలేదు.
⇔ ఇక కార్పొరేషన్(టౌన్‌ప్లానింగ్) అధికారుల అనుమతి లేకుండానే ఎగ్జిబిషన్ కొనసాగితుండడం గమనార్హం.
⇔ ఒక ప్రాణం బలి తీసుకున్నప్పటికీ.. నిర్వాహకులు ‘అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఎగ్జిబిషన్ మూసివేయబడినది’ అనే బోర్డు వేలాడదీయడం చూస్తే ఎగ్జిబిషన్ ఏర్పాటు వెనుక ఏ స్థాయిలో ‘చక్రం’ తిప్పాడో అర్థమవుతోంది.
అధికారులు మూసేశామని చెబుతున్నా...ఒక్కరోజు మాత్రమే మూసినట్లు వేసిన బ్యానర్
ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చాం
టెండర్ పద్ధతిలోనే ఎగ్జిబిషన్‌కు గ్రౌండ్‌కు కేటాయించాం. 60 రోజులకు రూ. 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 30తో గడువు ముగుస్తుంది. ఖాళీ చేయాలని మూడు రోజుల క్రితమే నోటీసులిచ్చాం. ఆ నోటీసులను వారు తీసుకోలేదు. మరో నెలరోజులు కావాలని అడుగుతున్నారు. దీనికి ఒప్పుకోలేదు. నోటీసులు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాం. ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ చేయిన్నాం. – ప్రశాంతి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
కేసు నమోదు చేశాం
ఎగ్జిబిషన్‌లో జరిగిన ఘటనపై నిర్వాహకులు, ఆపరేటర్‌లపై కేసులు నమోదు చేశాం. ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించాం. సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు జాయింట్‌వీల్ ఫిట్‌నెస్ తనిఖీ చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలనే షరతులతోనే అనుమతులు ఇచ్చాం. – జె.వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం
పట్టించుకునేవారు లేరు
ఎగ్జిబిషన్‌లో జెయింట్‌వీల్ విరిగి పడి పిల్లలందరూ పడిపోతే పట్టించుకునేవారు లేరు. కనీసం ఏమైందని చూసేందుకు కూడా నిర్వాహకులు రాలేదు. యథావిధిగా ఎగ్జిబిషన్ కొనసాగించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలి. – కృష్ణ, రుద్రంపేట, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment