
స్వాతంత్య్ర వేడుకల్లో మాట్లాడుతున్న డీప్యూటీ సీఎం అంజద్‌బాషా
సాక్షి, కడప : ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా తెలిపారు. గురువారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నవరత్నాల్లో పేర్కొన్న వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తాన్ని పెంచుతూ సీఎం వైఎస్ జగన్ ఫైలుపై తొలి సంతకం చేశారని అన్నారు.ఆరు నెలల క్రితం ఉన్న రూ. 1000ని 2019 జూన్ నుంచి రూ. 2250కి పెంచామని చెప్పారు. విభన్న ప్రతిభావంతులకు వైకల్య శాతంతో సంబంధం లేకుండా రూ. 3 వేలు, డయాలసిస్ రోగులకు రూ. 3500 నుంచి రూ. 10,000లకు పింఛన్ పెంచామని చెప్పారు. 3,00,840 మంది పింఛన్‌దారులకు నెలకు రూ. 9.15 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. పింఛన్‌అర్హత వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించామని చెప్పారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 12,500 ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా బోరు బావుల తవ్వకం, వ్యవసాయం కోసం పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు.పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని రైతు చనిపోతే రూ. 7 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలో 2019–20 ఖరీఫ్ సీజన్‌లో వైఎస్సార్ ఉచిత బీమా పంటల పథకం కింద 2.67 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 506 గ్రామాలలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి నిధి అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలను అందిస్తున్నామన్నారు. పిల్లలను చదివించుకునే అమ్మలకు ఏడాదికి ప్రభుత్వం రూ. 15 వేల ఆర్థికసాయం చేస్తుందన్నారు.
అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటని అన్ని వర్గాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో రెండు వేల వరకు వైద్య చికిత్సలను ఈ పథకంలో చేర్చారన్నారు. వైఎస్సార్ కలలుగన్న జలయజ్ఞం ద్వారా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించి కృష్ణా ఆయకట్టును స్థిరీకరించి కడపతోపాటు రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించనున్నట్లు వివరించారు. ఇప్పటికే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశామన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకెళ్లడంలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు నుంచి అన్ని పథకాలు డోర్ డెలివరీ ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు.
జిల్లాలో 10,557 మంది గ్రామ వలంటీర్లు, 4610 మంది వార్డు వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేశామన్నారు. పారదర్శకంగా పాలన నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు రూ. 906కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో గృహ, పారిశ్రామిక వినియోగదారులకు 24 గంటలు నాణ్యతమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు.కరువు నేపథ్యంలో వలసల నివారణకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల మంది కూలీలకు పనులు కల్పించి రూ. 250 కోట్లు వేతనాలు చెల్లించామన్నారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.జిల్లాలో 810 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అన్ని పట్టణ, గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటిని అందించేందుకు రూ. 3 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 17.42 కోట్లతో 139 వివిధ తరహా పరిశ్రమలు నెలకొల్పామన్నారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పెన్నానది లోయకు రోప్‌వే నిర్మాణానికి రూ. 7 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీ సర్వే చేయించి వాటిని డిజటలైజ్ చేయిస్తామన్నారు. ఇమామ్, మౌజన్లకు నెలకు రూ. 15 వేలు ఇస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీలు వేసినట్లు తెలిపారు.కడప చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు త్రిసభ్య కమిటీని నియమించగా, ఈ కమిటీ గత జులైలో విచారణ, పరిశీలన పూర్తి చేసిందని, అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రూ. 40 కోట్ల నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు ఈ సంవత్సరం సీఎం కడప స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
కేసీ కాలువ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి వద్ద కుందూ నదిపై 2.95 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలను ప్రభుత్వానికి పంపారన్నారు. గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఈ ఏడాది గండికోటలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రూ. 945 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కుందూ నది నుంచి రూ. 388 కోట్లతో ఎత్తిపోతల ద్వారా బ్రహ్మంసాగర్‌కు 5 టీఎంసీలు తరలిస్తామన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులకు ప్రశంసపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి, జేసీ శివారెడ్డి, అధికారులు,స్వాతంత్య్ర సమరయోధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment