కడప కల్చరల్: మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనాల గురించి నగరాలు మొదలుకుని మండల స్థాయి వరకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలోని మానస ఇన్ హోటల్‌లో ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి అధ్యక్షతన డాక్టర్ గాజులపల్లె రామచంద్రారెడ్డి రాసిన భావితరాల భవిత–మూడు రాజధానులు పుస్తక పరిచయ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి ఇత ర అతిథులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోనే మిగతా ప్రాంతాలు ఎంతో వెనుకబడి రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ జరగాలన్నారు.
∙నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా మన ప్రాంతం అలసత్వానికి గురైందని, డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలను కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాలనా వికేంద్రీకరణ వల్లనే మన జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ వస్తున్నాయన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విజన్‌కు మారుపేరుగా నిలిచారని కొనియాడారు.
ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయిలో కూడా మూడు రాజధానుల వల్ల కలిగే మేలు గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావడం సీమ వెనుకబాటు తనానికి కారణమన్నారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు శాంతమూర్తి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమని చెప్పారు.
ఫోరం సభ్యుడు డాక్టర్ జాన్‌బాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకంతో డాక్టర్ వైఎస్సార్ తెలుగు ప్రజలకు దేవుడయ్యాడని, నేడు జగన్ అంతకుమించిన పథకాలు చేపట్టి విజన్ గల నాయకుడిగా పేరు పొందారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రత్నకుమారి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు తగిన గౌరవం ఈ ప్రభుత్వంలోనే లభిస్తోందన్నారు. డాక్టర్ తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సీమకు అన్యాయం జరిగినా ఈ ప్రాంత వాసులు ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. ఫోరం సభ్యుడు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నేతను దూరం చేసుకోవద్దని సూచించారు. జోజిరెడ్డి, రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment