బాబు సర్కార్‌ అన్నింటా వైఫల్యం! | YSRCP Leaders Slams TDP Government In Kadapa | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ అన్నింటా వైఫల్యం: వైఎస్సార్‌సీపీ

Published Mon, Aug 27 2018 12:01 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

YSRCP Leaders Slams TDP Government In Kadapa - Sakshi

వైఎస్ఆర్‌ జిల్లా: చంద్రబాబు సర్కార్‌ అన్నింటా వైఫల్యం చెందిందని కడప మేయర్‌, వైఎస్సార్‌సీపీ నేత సురేష్‌ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరవుపై పోరు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రవీంద్రనాథ్‌, అంజద్‌ బాషా, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేయర్‌ సురేష్‌ బాబు  మాట్లాడుతూ..రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వడంలో వైఫల్యం కనబడుతోందని విమర్శించారు. జిల్లాలో 50 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు సాయం అందించలేదని వెల్లడించారు. నాలుగేళ్లుగా కరవు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే బీమా, బాబు ఇవ్వాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇ‍వ్వకుండా ఆగిపోయిందని అన్నారు. అన్నదాతలకు అండగా కరవుపై పోరాటం చేపట్టామని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీరు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని తెలిపారు. కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మంచి పరిపాలకుడు ఉంటే భగవంతుడు కరుణిస్తాడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఉన్నపుడు వర్షాలు పడ్డాయి...బాబు పాలనలో వర్షం జాడే లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకుందని, రైతులను, ప్రజా సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.

జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ..ఇంత వరకు జమ్మలమడుగులో ఒక్క విత్తనం కూడా వేయలేదని తెలిపారు. మా దగ్గర ఒక మంత్రి, ఒక విప్, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారు ఒక్క రోజు కూడా కరువు గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. మంత్రి సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, కేవలం కమీషన్ల కోసం వెంపర్లాట తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. జగనన్న సీఎం అయితేనే రైతులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

గోవింద రెడ్డి మాట్లాడుతూ..వంద టీఎంసీ నీళ్ల కోసం కడపలో జలాశయాలు కట్టానని చంద్రబాబు అంటున్నారు..మరి ఈ కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది మీరు కాదా అని సూటిగా అడిగారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని, ఆయన చర్యల వల్ల రైతులు ఖరీఫ్ సాగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కనీసం పశువులకు మేత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. కుందూ నదిలో నెల్లూరుకి 20 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని, ఆ నీటిని తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు... కానీ ఏమైంది బాబు కుమారుడికి మాత్రమే జాజ్‌ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భుజస్కందలపై వేసుకుందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ఆయన బంధువులకు న్యాయం చేస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు..ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు పూర్తి అనర్హుడు..మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు భజన మనుకుని తన సొంత నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement