'టీడీపీ ఎందుకు భయపడుతోంది'
అనంతపురం : విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఇతర హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి విమర్శించారు. హామీలను సాధించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నతెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలో పాల్గొనేందుకు ఆయన సోమవారం అనంతపురం జిల్లా కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
హామీ ఇవ్వని ఇసుక రవాణా చేపట్టి ఇసుక మాఫీయాని తయారు చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ఒక్కటే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాణప్రదమన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఈ విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు బాధను వ్యక్తం చేశారన్నారు. రెక్కలు విరిచేసి ఎగరమంటే ఎలాగంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మంత్రి పదవుల కోసం బీజేపీతో కొనసాగడం ఎందుకుని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు.