ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్ పాలన సాగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్ పాలన కొనసాగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో విధుల నుంచి తొలగించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను ఇబ్బందులు పెడుతూ వారి ఉసురు పోసుకోవద్దని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. ప్రజలను అన్ని రకాలుగా మోసంచేస్తున్నారని వివేకా మండిపడ్డారు. ఇంత మంది ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు ఐదేళ్లు పదవిలో ఉండబోరన్నారు.
నారా లోకేశ్ కు ఏం సంబంధం ఉందని ఆయన వెంట అధికారులను అమెరికాకు పంపారని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి మాట్లాడుతూ చంద్రబాబు పదవిలోకి వచ్చీ రాగానే అంగన్‌వాడీలను అణగదొక్కడం మొదలు పెట్టారన్నారు. ఆడవాళ్లే కదా నోరెత్తి మాట్లాడలేరని 15 మంది అంగన్‌వాడీలను తొలిగించారన్నారు.. వీరికి మద్దతుగా దీక్షల చేస్తున్న అంగన్‌వాడీలకు నోటీసులు ఇచ్చారన్నారు. దీనిని చూస్తే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? నియంత పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఐసీడీఎస్‌ను కాపాడుకునేందుకు సేవ్ ఐసీడీఎస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.