‘‘కళలంటే అంత చులకనా... కళాకారులను పిలిచి అవమానిస్తారా? కార్యక్రమం పెట్టమని ఎవరు అడిగారు...తీరా ప్రదర్శనకు వస్తే పూర్తిగా కార్యక్రమం చేయనివ్వరా? ఇదేనా కళలకు విజయనగరంలో ఇచ్చే గౌరవం?’’ ఇవీ విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో సోమవారం కళాకారులు, వారు కుటుంబీకులు, కళాభిమానులు నుంచి వినిపించిన వాఖ్యలు.
విజయనగరం గంటస్తంభం: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా ఆనందగజపతి ఆడిటోరియంలో రెండోరోజు సోమవారం ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో పలు నృత్య, గీత, పద్య, కీర్తన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే గాంధీ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేయాల్సిన స్వచ్ఛత సేవ కార్యక్రమం ఉదయం అక్కడే ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం 11 గంటల దాటే వరకు కళా ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయింది. సుమారు రెండుగంటల కార్యక్రమం ఆవిరి కావడంతో ప్రభావం కళా ప్రదర్శనలపై పడింది. దీంతో సమయాన్ని తగ్గించుకోవాలని కళాకారులకు నిర్వహణ బాధ్యత చూస్తున్న అధికారులు సూచించారు.
బి.ఎ.నారాయణ, సంగీత కళాశాల ప్రిన్స్‌పాల్ అనురాధా పరుశరాం గేయకచేరి చేస్తూ వందేమాతర గీతం, వినాయక స్తుతి అలపించారు. అనంతరం మాట్లాడిన అధికారులు మరో పాటతో ముగించాలని సూచించారు. దీంతో బి.ఎ.నారాయణ కళాకారులకు ఇంతసమయం పాడాలని దయచేసి సూచించవద్దని వేడుకున్నారు. అయినా నిర్వాహకులు అంగీకరించకపోవడంతో కోపంగా తన బృందాన్ని తీసుకెళ్లిపోయారు. దీనిపై అనురాధా పరుశురాం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కళాకారులకు అవమానమన్నారు. దీంతో ప్రదర్శనలో పాల్గొన్న వారి కుటుంబీకులు, వీక్షించేందుకు వచ్చిన కళాకారులు తీవ్రంగా మండిపడ్డారు. పిలిచి అవమానించడం ఏమిటని ఆగ్రహం చెందారు.
సుదీర్ఘ అనవసర ప్రసంగాలకు సమయం ఉంటుందని, కళల ప్రదర్శనకు సమయం ఇవ్వరా అని నిట్టూర్చారు. స్వచ్ఛత సేవ కార్యక్రమాన్ని ఇక్కడెవరు పెట్టమన్నారని ప్రశ్నించారు. తర్వాత భగవతి నృత్య కళామండలి వెంకటేశ్వర వైభవం ప్రదర్శనలో భాగంగా మధ్యలో మైకు కట్ చేయడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. తర్వాత విజయనగరం ఎమ్పీడీవో శ్రీరాంమూర్తి ఎంత ప్రాధేయపడినా మరో పాటకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశతో నిష్క్రమించారు. ఇలా సాయంత్రం వరకు ప్రతి కళాకారుల ప్రదర్శనకు గడువు తగ్గించడంతో కళాకారులు అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పలువురు విమర్శించారు.
అంతా గందరగోళం..
విజయనగరం వైభవం తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛత సేవ కార్యక్రమం, అవార్డుల ప్రదానోత్సవం పెట్టడంతో ఆనందగజపతి ఆడిటోరియంలో అంతా గందరగోళంగా తయారైంది. అవార్డులు ప్రదానం కూడా పద్ధతి ప్రకారం జరగకపోవడంతో వేదిక గజిబిజిగా కనిపించింది. దీంతో అక్కడకు వచ్చిన ఆహుతులకు ఏమి జరుగుతుందో అర్ధంకాలేదు. నిర్వహణ లోపం ఇందుకు కారణమన్న విమర్శలు వినిపించాయి. గతేడాది మాదిరిగా సమర్థమైన అధికారులు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమైంది. వచ్చే ఏడాదైనా ఇలాంటి లోపాలు లేకుండా చూడాలని కళాకారులు సూచించారు.