వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సమావేశమైన బీసీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: గత ఎన్నికలకు ముందు ఒక విధంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగానే బడుగు, బలహీన వర్గాలను వంచనకు గురి చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడదామంటూ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 20న జిల్లా కేంద్రం వేదికగా జరిగే బీసీల నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణపై ఆ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు అధ్యక్షతన అనంతపురం పార్లమెంటు పరిధిలోని కుల సంఘాలు, డివిజన్ కన్వీనర్లు, అధ్యక్షులు, కార్యకర్తలతో జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. సీఎం ఇచ్చిన 600 హామీలలో ప్రత్యేకంగా బీసీలకు 130 హామీలు ఉన్నాయన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం నెరవేర్చలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలను వంచన చేసేందుకు ‘జయహో బీసీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ తరహా చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి మోసాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 20న ఉదయం 10 గంటలకు జెడ్పీ హాల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందిస్తామన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మనేరు కొండమ్మ, సంయుక్త కార్యదర్శి షాను, అనంతపురం పార్లమెంటు కార్యదర్శి రాధాయాదవ్, నగర అద్యక్షుడు చింత సోమశేఖర్‌రెడ్డి, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే చంద్ర, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వడ్డే గోపాల్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, 24వ డివిజన్ కన్వీనర్ లీలావతి, దేవాంగం రామయ్య, రత్నమయ్య, రాధాకృష్ణ, షరీఫ్, శివప్రసాద్, ఓబిలేసు, శ్రీనివాసులు, నాగశేషయ్య, రవితేజ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టారు
అధికారంలోకి వచ్చేందుకు బీసీ కులాలను ఎస్సీ, ఎస్టీ కులాల్లో చేరుస్తామంటూ చెప్పి, అధికారం చేపట్టిన తర్వాత కులాల మధ్య చిచ్చుబెట్టారు. బీసీలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 20న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి. – పామిడి వీరాంజినేయులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment