వివాహ బంధంతో ఒక్కటైన లోచనదాసు, గాంధర్వికా రాయ్
సాక్షి, అనంతపురం కల్చరల్: ‘నువ్వా దరిని నేనీ దరిని ఇస్కాన్ కలిపింది ఇద్దరిని..’ అంటూ ఆనంద సాగరంలో మునిగిపోయారు ఆ ఖండాంతర ప్రేమికులు. ఫ్రాన్స్‌కు చెందిన అమ్మాయి.. అనంతపురానికి చెందిన అబ్బాయి హైందవ సంప్రదాయం ప్రకారం శుక్రవారం జిల్లా కేంద్రం అనంతపురంలోని ఇస్కాన్ మందిరంలో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హిందూపురానికి చెందిన గోవిందప్ప, లక్ష్మీదేవమ్మ దంపతుల కుమారుడు లోచనదాసు(లోకేష్‌బాబు) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగనిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి కంపెనీ పనులపై ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇస్కాన్ మందిరాన్ని నిర్వహిస్తున్న లోయ్‌సన్ జోయల్, సోనియా దంపతుల కుమార్తె గాంధర్వికా రాయ్(గంగ)ని చూడగానే ప్రేమలో పడ్డాడు.
పాశ్చాత్య దేశాల్లో హైందవ పద్ధతులను భక్తిశ్రద్ధలతో పాటిస్తున్న తీరు నచ్చి ఇద్దరూ దగ్గరయ్యారు. ఇద్దరూ ఇస్కాన్ భక్తులు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించారు. కార్తీక శుక్రవారం నగరంలోని ఇస్కాన్ మందిరంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఘనంగా వీరి వివాహం జరిగింది. కార్యక్రమంలో ఇస్కాన్ మందిరాల నిర్వాహకులు దామోదర గౌరంగదాసు, టీటీడీ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment