
రాస్తారోకో చేస్తున్న డ్వాక్రా మహిళలు
* అప్పుడు కట్టొద్దని ఇప్పుడెలా అడుగుతారు?
* డ్వాక్రా మహిళల మండిపాటు.. రాస్తారోకో
పుట్టపర్తి: ‘ఎన్నికలప్పుడు మా గ్రామానికి వచ్చిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. డ్వాక్రా మహిళలెవరూ రుణాలు కట్టొద్దని చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమే.. రుణాలన్నీ మాఫీ చేస్తామని మారెమ్మ దేవత సాక్షిగా హామీ ఇచ్చారు. ఇపుడు అధికారులు వడ్డీతో సహా రుణాలు చెల్లించాలంటున్నారు. వడ్డీతో కట్టమంటే పైసా కూడా చెల్లించం. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన డ్వాక్రా మహిళలు స్పష్టం చేశారు.
ఈ మేరకు శుక్రవారం వారు స్థానిక ధర్మవరం-బెంగళూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముందుగా స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లారు. తండాలో అన్ని సంఘాలకు కలిపి రూ. 4 లక్షలకు పైగా రుణాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ పోను మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
అయితే.. రూ.3 లక్షలకు అసలు, వడ్డీ కలిపి సుమారు రూ. 3.5 లక్షలు చెల్లించాలని వెలుగు అధికారులు సూచించారు. దీనికి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చేతగానితనం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని వాపోయారు. అక్కడే రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వెలుగు నిడిమామిడి క్లష్టర్ సీసీ సుధాకర్ రాగానే.. ఆయన్ను పక్కనే ఉన్న మారెమ్మ ఆలయం వద్ద నిర్బంధించారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ ఇళ్లకు వెళ్లిపోయారు.