అనంతపురం సెంట్రల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దూదేకుల చమన్(56) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కారులో అనంతపురానికి తీసుకువస్తుండగా ఎన్‌ఎస్‌గేటు – కుంటిమద్ది గ్రామాల మధ్య గుండెపోటురాగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అయినప్పటికీ కుటుంబీకులు సవేరా ఆస్పత్రికి తీసురాగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చమన్ భౌతికకాయం వద్ద ఆయన భార్య రమీజాబీ విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. చమన్‌కు ఓ కుమారుడు ఉమర్ ముక్తర్ సంతానం.. కర్ణాటకతో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా చమన్ మృతి రాజకీయవర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు, టీడీపీ కార్యకర్తలు సవేరా ఆస్పత్రికి తరలివచ్చారు.
‘‘నేను వెళ్లొస్తా వదినా’’
మంత్రి పరిటాల రవి అనుచరుడైన చమన్...ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ వేడుకల ఏర్పాట్లు చూసేందుకు దాదాపు 10 రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు. ఆదివారం పెళ్లి ముగియగానే అక్కడి నుంచి వచ్చేసిన ఆయన...సోమవారం తిరిగి వెంకటాపురానికి వెళ్లారు. పెళ్లి వేడుకల గురించి పరిటాల సునీత బంధువులతో ముచ్చటించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనంతపురానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను వెళ్లొస్తా వదినా’’ అంటూ మంత్రి సునీతతో చెప్పి ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.
కుప్పకూలిన మంత్రి సునీత
తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్ విగతజీవిగా కనిపించడంతో రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోయారు. వెంకటాపురం నుంచి చమన్‌ను తరలిస్తున్న వాహనం వెనుకే మంత్రి సునీత కూడా బయలుదేరి వచ్చారు. సవేరా ఆసుపత్రికి చేరుకున్న ఆమెకు చమన్ ఇక లేరని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా బోరున విలపించారు. ఏడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.
నేడు అంత్యక్రియలు
చమన్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్.కొత్తపల్లికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకూ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద ఉంచుతామనీ, ఆ తర్వాత మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహి పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చమన్ మృతికి ‘అనంత’ సంతాపం
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ మృతి పట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి సంతాపం తెలిపారు. జెడ్పీ చైర్మెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, రాజకీయాలకతీతంగా ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఆయన హఠాన్మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
బహిష్కృత నేత నుంచి... జెడ్పీ చైర్మన్‌గా...
చమన్ ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురయ్యారు.. కానీ తిరిగొచ్చి జిల్లా ప్రథమ పౌరునిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... పరిటాల రవి ఉన్నన్నాళ్లు కుడిభుజంగా పనిచేశాడు. 2004 ముందు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు వందల సంఖ్యలో జరిగాయి. ప్రత్యర్థులు ఒకర్నొకరు నెత్తుటేరులు పారించుకున్నారు. ఫ్యాక్షన్ హత్యల వెనుక పరిటాల రవి అనుచరుడైన చమన్ హస్తం ఉండేదన్న ఆరోపణలున్నాయి.
1992లో ఆర్వోసీ(రీ ఆర్గనైజేషన్ కమిటీ) ఏర్పాటులో పోతుల సురేష్‌తో కలిసి చమన్ ప్రధాన భూమిక పోషించారనీ, వీరిద్దరూ పరిటాల రవికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ప్రత్యర్థివర్గాన్ని మట్టుపెట్టినట్లు ఆరోపణలున్నాయి. 1998లో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో జరిగిన జంటహత్యల కేసులోనూ చమన్ పేరు స్పష్టంగా వినిపించింది. అప్పటి నుంచి చమన్ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో 2004లో కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత 2012లో బయటకు వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని చిన్న కుగ్రామంలో గడిపినట్లు పలు సందర్బాల్లో ఆయన సన్నిహితులతో చెప్పుకున్నారు.
2014 ఎన్నికల్లో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన చమన్.. రామగిరి జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందడంతో పాటు 2014 జూలై 5న 19వ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రమాణ చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పూల నాగరాజుకు అవకాశం ఇచ్చేందుకు 2017 సెప్టెంబర్ 8వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. చైర్మెన్‌గా పనిచేసినన్నాళ్లు మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఇసుమంతైనా కూడా ఆరోపణలు రాకుండా చూసుకున్నారు.
అయితే పార్టీ పెద్దలు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని కొద్దిరోజుల పాటు ముభావంగా ఉన్న ఆయన, ఇటీవల చురుగ్గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలతో పాటు దూదేకుల సం ఘం అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment