chaman
-
చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌తో ఉన్న కీలక సరిహద్దు చమన్ క్రాసింగ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన భయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దులు దాటి వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారని జియో న్యూస్ తెలిపింది. పాక్ బాట పట్టిన వేలాదిమంది అఫ్గాన్లు ఇప్పటికే చమన్ వద్ద పడిగాపులు కాస్తుండగా, వీరందరినీ తాము అనుమతించే పరిస్థితుల్లో లేమని పాక్ అధికారులు అంటున్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు సడలిస్తే 10 లక్షల మందైనా అఫ్గాన్లు వచ్చే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో 90% వరకు ఫెన్సింగ్ ఉంది. 12 చోట్ల ఏర్పాటు చేసిన చెక్పాయింట్ల ద్వారా సరైన ప్రయాణ పత్రాలున్న వారినే ప్రస్తుతం పాక్‌లోకి అనుమతిస్తున్నారు. -
చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ దూదేకుల చమన్ మృతిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చమన్ మృతి చెందిన రెండు రోజులకే ఆయన డ్రైవర్ నూర్ బాషా ప్రమాదంలో మరణించడం వివాదస్పదంగా మారిందని తెలిపారు. నూర్ బాషాను ఢీకొన్న కారును ఇప్పటివరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. చమన్, పరిటాల కుటుంబం మధ్య అభ్రిప్రాయభేదాలు ఉన్నాయని.. చమన్ మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. చమన్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
చమన్‌ది సహజ మరణమేనా.?
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్‌ది సహజ మరణమేనా.? ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ఆయన ఎందుకు హఠాన్మరణం చెందారు? గుండెపోటుతోనే మృతి చెందారా..? లేదా ఆరోజు ఏమైనా జరిగిందా? ఇటీవల చమన్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి. చమన్ మృతి చెందిన నాలుగురోజుల్లోనే ఆయన కారు డ్రైవర్ నూర్ మహ్మమద్(27) గురువారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో చమన్ మృతిపై అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అనంతపురం టాస్క్ఫోర్సు: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు దూదేకుల చమన్ ఈనెల 7న హఠాన్మరణం చెందారు. పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల కుమార్తె స్నేహలత వివాహాన్ని అంతకు ముందురోజు వెంకటాపురంలో ఘనంగా జరిపించారు. మరుసటిరోజు వెంకటాపురానికి వెళ్లిన చమన్ హఠాన్మరణం చెందారు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే చమన్ అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నా... అధికారికంగా వెల్లడించలేదు. చమన్ మృతి చెందిన మరుసటి రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా రాజీనామా..! ముందుగా నిర్ణయించిన రెండున్నర సంవత్సరాల పదవీకాలం ముగిసినప్పటికీ చమన్ జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడం...ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సెప్టెంబర్ 8న ఆయనతో చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పుకార్లు వినిపించినా ఆ మేరకు చర్యలు లేవు. టీడీపీకి కోసం, పరిటాల రవీంద్ర కోసం తన జీవితాన్నే త్యాగం చేసినా.. పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో చమన్ తీవ్ర అసంతృప్తిలో ఉండిపోయారు. పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చర్చ పార్టీ తనను గుర్తించలేదని ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆపార్టీ వర్గాల్లోనే జోరుగా సాగింది. ప్రముఖ పార్టీ తరుఫున హిందూపురం ఎంపీ టికెట్‌ను ఆశించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఈనెల 7న మంత్రి సునీత సమక్షంలో చర్చ జరిగినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఒత్తిడి తెచ్చారని, చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనైన ఆయన అస్వస్థతకు గురైనట్లు అనుమనాలు గుప్పుమంటున్నాయి. అయితే గతంలో ఒకసారి చమన్ గుండెపోటుకు గురయ్యారని, వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందువల్ల ఆయన గుండెపోటుతోనే హఠాన్మరణం చెందారని పేర్కొంటున్నారు. చమన్ డ్రైవర్ అనుమానాస్పద మృతి చమన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన కారుడ్రైవర్‌గా పనిచేసిన నూర్‌మహ్మద్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నగరంలో బోయవీధికి చెందిన నూర్‌మహ్మద్ గత కొద్దికాలంగా చమన్‌కు కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హఠాన్మరణం చెందిన రోజు కూడా నూర్ మహ్మదే కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిసింది. అతన్ని బుధవారం నుంచి పనిలోకి రావద్దన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం రాత్రి బత్తలపల్లివైపు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. అయితే మన్నీల సమీపంలోకి రాగానే మహబూబ్ బాషా(45) అనే వ్యక్తి ఐచర్ వాహనం పంక్చర్ కాగా, ఆ డ్రైవర్‌ను మాట్లాడించేందుకు వెళ్తుండగానే... అనంతపురం నుంచి బత్తలపల్లి వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం వీరిని ఢీ కొంది. ఈ ఘటనలో గుత్తి ఆర్ఎస్ ప్రాంతానికి చెందిన ఐచర్ డ్రైవర్ మహబూబ్ బాషా (47)తో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ చమన్ డ్రైవర్ నూర్ మహమ్మద్ (27) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నగరంలోని బోయవీధికి చెందిన నూర్ మహమ్మద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఐచర్ వాహనం క్లీనర్ మహేష్ నాయుడు ఫిర్యాదు మేరకు పోసీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ అనుమానాలే..! అయితే ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూర్‌మహ్మద్ హత్యకు కుట్ర జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతోనే చనిపోయాడని పేర్కొంటున్నారు. చమన్ మృతిపైనే అభిమానాలకు నెలకొన్న అనుమానాలు నివృత్తి కాకమునుపే ఆయన కారు డ్రైవర్ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ ముఖ్యనేతలపై ఉంది. -
చమన్ హఠాన్మరణం
అనంతపురం సెంట్రల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దూదేకుల చమన్(56) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కారులో అనంతపురానికి తీసుకువస్తుండగా ఎన్‌ఎస్‌గేటు – కుంటిమద్ది గ్రామాల మధ్య గుండెపోటురాగా మార్గమధ్యలోనే మృతి చెందారు. అయినప్పటికీ కుటుంబీకులు సవేరా ఆస్పత్రికి తీసురాగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చమన్ భౌతికకాయం వద్ద ఆయన భార్య రమీజాబీ విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. చమన్‌కు ఓ కుమారుడు ఉమర్ ముక్తర్ సంతానం.. కర్ణాటకతో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా చమన్ మృతి రాజకీయవర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు, టీడీపీ కార్యకర్తలు సవేరా ఆస్పత్రికి తరలివచ్చారు. ‘‘నేను వెళ్లొస్తా వదినా’’ మంత్రి పరిటాల రవి అనుచరుడైన చమన్...ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ వేడుకల ఏర్పాట్లు చూసేందుకు దాదాపు 10 రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు. ఆదివారం పెళ్లి ముగియగానే అక్కడి నుంచి వచ్చేసిన ఆయన...సోమవారం తిరిగి వెంకటాపురానికి వెళ్లారు. పెళ్లి వేడుకల గురించి పరిటాల సునీత బంధువులతో ముచ్చటించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అనంతపురానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను వెళ్లొస్తా వదినా’’ అంటూ మంత్రి సునీతతో చెప్పి ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు. కుప్పకూలిన మంత్రి సునీత తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్ విగతజీవిగా కనిపించడంతో రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోయారు. వెంకటాపురం నుంచి చమన్‌ను తరలిస్తున్న వాహనం వెనుకే మంత్రి సునీత కూడా బయలుదేరి వచ్చారు. సవేరా ఆసుపత్రికి చేరుకున్న ఆమెకు చమన్ ఇక లేరని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా బోరున విలపించారు. ఏడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. నేడు అంత్యక్రియలు చమన్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్.కొత్తపల్లికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకూ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద ఉంచుతామనీ, ఆ తర్వాత మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహి పార్టీ వర్గాలు వెల్లడించాయి. చమన్ మృతికి ‘అనంత’ సంతాపం అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ మృతి పట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి సంతాపం తెలిపారు. జెడ్పీ చైర్మెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, రాజకీయాలకతీతంగా ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఆయన హఠాన్మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బహిష్కృత నేత నుంచి... జెడ్పీ చైర్మన్‌గా... చమన్ ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురయ్యారు.. కానీ తిరిగొచ్చి జిల్లా ప్రథమ పౌరునిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన... పరిటాల రవి ఉన్నన్నాళ్లు కుడిభుజంగా పనిచేశాడు. 2004 ముందు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు వందల సంఖ్యలో జరిగాయి. ప్రత్యర్థులు ఒకర్నొకరు నెత్తుటేరులు పారించుకున్నారు. ఫ్యాక్షన్ హత్యల వెనుక పరిటాల రవి అనుచరుడైన చమన్ హస్తం ఉండేదన్న ఆరోపణలున్నాయి. 1992లో ఆర్వోసీ(రీ ఆర్గనైజేషన్ కమిటీ) ఏర్పాటులో పోతుల సురేష్‌తో కలిసి చమన్ ప్రధాన భూమిక పోషించారనీ, వీరిద్దరూ పరిటాల రవికి ముఖ్య అనుచరులుగా ఉంటూ ప్రత్యర్థివర్గాన్ని మట్టుపెట్టినట్లు ఆరోపణలున్నాయి. 1998లో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో జరిగిన జంటహత్యల కేసులోనూ చమన్ పేరు స్పష్టంగా వినిపించింది. అప్పటి నుంచి చమన్ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో 2004లో కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రాగానే చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత 2012లో బయటకు వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని చిన్న కుగ్రామంలో గడిపినట్లు పలు సందర్బాల్లో ఆయన సన్నిహితులతో చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన చమన్.. రామగిరి జెడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందడంతో పాటు 2014 జూలై 5న 19వ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రమాణ చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పూల నాగరాజుకు అవకాశం ఇచ్చేందుకు 2017 సెప్టెంబర్ 8వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. చైర్మెన్‌గా పనిచేసినన్నాళ్లు మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఇసుమంతైనా కూడా ఆరోపణలు రాకుండా చూసుకున్నారు. అయితే పార్టీ పెద్దలు తనతో బలవంతంగా రాజీనామా చేయించారని కొద్దిరోజుల పాటు ముభావంగా ఉన్న ఆయన, ఇటీవల చురుగ్గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్గా పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలతో పాటు దూదేకుల సం ఘం అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. -
పరిటాల ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం చెందారు. చమన్‌కు సోమవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పరిటాల రవి కుమార్తె వివాహ వేడుకల పర్యవేక్షణ కోసం గత మూడు రోజులుగా చమన్ వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్తతకు గురైనట్టు సన్నిహితులు తెలిపారు. చమన్ మరణవార్త విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్.. రవి హత్య తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చమన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014 నుంచి 2017 వరకు ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. సొమ్మసిల్లిన మంత్రి సునీత చమన్ అస్వస్తతకు గురైన వార్త తెలుసుకున్న మంత్రి సునీత హుటాహుటిన సవేరా ఆసుపత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చమన్ చనిపోయారన్న వార్త విన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు. -
26న చైర్మన్ పదవికి రాజీనామా
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఈనెల 26న రాజీనామా చేయనున్నట్లు చమన్ ప్రకటించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేస్తానన్నారు. చైర్మన్‌గా మూడేళ్ల పాటు క్రమశిక్షణతో పని చేశానన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. చాలా పనులు పెండింగ్‌లో పడనుండటంతో వాటిని పూర్తి చేసే ఉద్దేశంతోనే గడువు పొడిగించుకున్నానే తప్ప స్వార్థంతో కాదన్నారు. తాజాగా ఎంపీడీఓలకు ఆర్డర్ కాపీలను అందించాల్సి ఉందన్నారు. సీఈఓ రామచంద్ర సేవలు ఎనలేనివన్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది, ప్రతి పక్షంతో పాటు అధికార పార్టీకి చెందిన అన్ని వర్గాల ప్రజలు తనకు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఏం చేశారని జెడ్పీ చైర్మన్‌కు అవార్డు’
అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌కు ఆయన గత చరిత్ర చూసి భయపడి శ్వశక్తీకరణ్ పురస్కారానికి ఎంపిక చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి రమణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ఈ అవార్డు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రజలు ఎన్నుకున్న గ్రామ పంచాయతీలను, మండల పరిషత్‌లను డమ్మీలు చేసి జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాలో అన్ని రంగాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉపాధి పనులు చేసిన వారికి కూలి కూడా ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొని ఉంటే బాగా అభివృద్ధి చేస్తున్నారని అవార్డులకు ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవార్డు అందుకునేవారైనా పునరాలోచించాలని సూచించారు.ల -
ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్
అనంతపురం సిటీ : దేశంలోనే 9 మందిని ఉత్తమ జెడ్పీ చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వానికి వివరాలు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జెడ్పీ ఆవరణలో జరిగిన జ్యోతిరావ్ పూలే విగ్రహావిష్కరణలో ఎంపీ నిమ్మల, మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పలువురు ఎమ్మెల్యేలు చమన్‌ను అభినందించారు. -
లోగుట్టు పెరుమాళ్లకెరుక !
– జెడ్పీ చైర్మన్ మార్పుపై టీడీపీలో జోరుగా చర్చ – చమన్ రాజీనామా చేయకపోవడంతో పూల నాగరాజులో ఆందోళన – ఒప్పందం మేరకు తనకు పదవి ఇవ్వాలని పార్టీ నేతలపై ఒత్తిడి! – అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కీలక నేతల హామీ – నాగరాజుకు పీఠం దక్కకుండా మరో ‘రాజకీయం’? (సాక్షి ప్రతినిధి, అనంతపురం) జిల్లా పరిషత్ చైర్మన్ మార్పు విషయమై టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. ఒప్పందం మేరకు జనవరి ఐదో తేదీతోనే చమన్ పదవీకాలం ముగియడం, ఆపై టీడీపీ అధిష్టానం మరో మూడు నెలలు గడువు పొడిగించడం, ఆ కాలం కూడా ఈ నెల ఐదుతో ముగియడంతో జెడ్పీ పీఠంపై చర్చ మరింత జోరందుకుంది. చమన్ పీఠం దిగిపోతారా? పూల నాగరాజుకు చైర్మన్‌గిరి దక్కుతుందా? అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఒప్పందం మేరకు పదవిని తనకు కట్టబెట్టాలని టీడీపీ కీలక నేతలపై నాగరాజు ఒత్తిడి తేవడంతో ఈ పంచాయితీని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు జిల్లా నాయకత్వం సిద్ధమైంది. వారం రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునేలా చూస్తామని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో జిల్లా పరిషత్ పీఠం ఆ పార్టీ వశమైంది. పార్టీ ఒప్పందం మేరకు మొదటి రెండున్నరేళ్లు చమన్, ఆపై గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూలనాగరాజుకు చైర్మన్‌గిరి కట్టబెట్టాలి. ఈ క్రమంలో డిసెంబర్ ఆఖరి వారంలో టీడీపీ జిల్లా ఇన్చార్జ్ కొల్లు రవీంద్ర నేతృత్వంలో సమన్వయక కమిటీ సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రులు పల్లె, పరిటాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మ¯Œన్ చమన్ కూడా హాజరయ్యారు. ఒప్పందం మేరకు జెడ్పీపీఠం నాగరాజుకు ఇవ్వాలని మెట్టు గోవిందరెడ్డి ప్రస్తావించారు. దీనిపై జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి స్పందించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరో ఆర్నెల్లు పొడిగించాలని చమన్‌తో పాటు మంత్రి పరిటాల సునీత చంద్రబాబును కోరగా మూణ్నెల్లు అవకాశమిచ్చారు. ఈ గడువు కూడా బుధవారంతో ముగిసింది. ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి పదవి కట్టబెట్టడం, ఎమ్మెల్సీగా దీపక్‌రెడ్డి ఉండటంతో మరో పదవిన అదే నియోజకవర్గానికి ఎందుకని టీడీపీలోని ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ అంశం తెరపైకి రావడంతో నాగరాజు అప్రమత్తమై జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు కీలకనేతల వద్ద విషయాన్ని ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. పూల నాగరాజును ఆయుధంగా చేసుకుని.. పార్టీలో సీనియర్ నేతలైన తమకు మంత్రి పదవి దక్కలేదని కొందరు, తాము సిఫార్సు చేసినవారికి పదవులు రాలేదని ఇంకొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కాలవ శ్రీనివాసులుకు మంత్రి పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాయదుర్గం ప్రాంతానికి చెందిన దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. పూల నాగరాజుకు ఎలాగైనా జెడ్పీ చైర్మన్‌గిరి కట్టబెడితే నియోజకవర్గంలో కాలవకు చెక్‌పెట్టొచ్చని భావిస్తున్నారు. మంత్రిగా ఉండటంతో కాలవ నియోజకవర్గంలో తక్కువ సమయం గడిపే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో నాగరాజు, దీపక్‌రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధిస్తారని భావిస్తున్నారు. దీనికితోడు ఈ వర్గం మొత్తం మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగానూ పావులు కదుపుతోంది. చమన్‌ను దించడం ద్వారా సునీతకు చెక్ పెట్టడం, నాగరాజును ప్రమోట్ చేయడం ద్వారా రాయదుర్గంలో కాలవకు ఇబ్బందులు సృష్టించినట్లు అవుతుందనేది ఆ వర్గం లెక్క! కొత్త చర్చతో నాగరాజులో ఆందోళన టీడీపీలో ఓ ఎమ్మెల్యే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పూల నాగరాజుకు చైర్మన్‌గిరి దక్కదని, దానిపై ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే చెప్పిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరిటాల వర్గం ధర్మవరం, పెనుకొండలో పూర్తిగా పట్టుకోల్పోయి రాప్తాడుకు మాత్రమే పరిమితమైంది. ఆ వర్గం వెంట నిలిచే నేతలు కరువయ్యారు. ఈ క్రమంలో చమన్ ఒక్కరే వారి వెంట నడుస్తున్నారు. ఈ క్రమంలో చమన్‌ను కూడా కాపాడుకోకపోతే రాప్తాడులోనూ ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. దీంతో చమన్‌ను జెడ్పీచైర్మన్‌గా కొనసాగించాలని, రాయదుర్గానికి జెడ్పీ పీఠం బదులుగా మంత్రి పదవి కేటాయిస్తే బాగుంటుందని మంత్రి సునీత, కాలవ శ్రీనివాసులు ఇద్దరూ కలిసి సీఎం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం కూడా అంగీకరించారని సదరు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ క్రమంలో నాగరాజుకు జెడ్పీ పీఠం దక్కకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాగరాజు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర వేదన పడుతున్నట్లు సమాచారం. ఎవరి స్వార్థరాజకీయాలు వారు చూసుకుని.. పార్టీకోసం శ్రమించిన కార్యకర్తలను, ఒప్పందం మేరకు వారికి ఇచ్చిన మాటను తప్పితే పార్టీ ఎలాంటి సందేశాన్ని పంపినట్లు అవుతుందని నాగరాజు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ జెండా మోసిన వారిని కాదని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకున్నారని, ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నట్లు సమాచారం. ఏదిఏమైనా జెడ్పీచైర్మన్ పీఠం కేంద్రంగా టీడీపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అని ఇతర పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. -
‘ప్రభుత్వ నిధుల గురించి లోకేశ్ తో మాట్లాడా’
అనంతపురం: జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ చమన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జెడ్పీ నిధుల కోసం నారా లోకేశ్ తో చర్చిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రభుత్వంలో ఏ పదవిలో లేని లోకేశ్ తో నిధుల గురించి చర్చించామని చమన్ వెల్లడించడంతో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అవాక్కయ్యారు. జిల్లా పరిషత్ నిధుల గురించి లోకేశ్ చర్చించడమేమిటని సభ్యులు గుసగుసలాడారు. లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనడానికి చమన్ వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. కాగా, జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చాంద్ బాషాకు చేదు అనుభవం ఎదురైంది. కదిరి నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయనను నిలదీశారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. -
షరామామూలే..!
- ఉన్నతాధికారులు లేకుండానే స్థాయి సంఘం సమావేశాలు - మరోసారి కోరం లేక స్త్రీ , శిశు సంక్షేమ శాఖ సమావేశం వాయిదా అనంతపురం సిటీ : ‘వేల కోట్లు తాగునీటి కోసం విడుదల చేస్తున్నామని అటు ప్రభుత్వం, ఇటు జిల్లా కలెక్టర్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. మా గ్రామాల్లో 50 మందికి కూడా తాగునీరు అందడం లేదు. ఇంతకీ నిధులు ఉన్నాయా? లేక ఆ లెక్కలు కాగితాలకు పరిమితమా?’ అని కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరి అధికారులను ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్రల అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగానే పలువురు జెడ్పీటీసీలు ప్రభుత్వ పాలనా తీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాలకు చాలా శాఖలకు సంబంధించిన అధికారులు గైర్హాజరు కావడంతో సమావేశాలు చప్పగా సాగాయి. స్త్రీ శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘం సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఆరు అంశాలపై మాత్రమే చర్చ జరిగింది. మూడు అంశాలపై చర్చకు చైర్మన్‌గా సుభాషినమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశాలు కూడా పరిషత్‌లో షరా మామూలుగానే సాగాయి. తాగునీటి పైనే ప్రధాన చర్చ తాగునీటి సమస్యపై ప్రధాన చర్చ జరిగింది. కంబదూరు, కూడేరు మండలల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. వేల కోట్ల నిధులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా ఎందుకు ఖర్చ చేయడం లేదన్నారు. ఉన్నతాధికారి అందుబాటులో లేక పోవడంతో స్పందించిన కిందిస్థాయి సిబ్బంది త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వివరాలు తెలీవు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణపు పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని సభ్యులు కోరడంతో నూతన ఎస్ఈ సుబ్బరావు ఇంకా తనకు పూర్తి వివరాలు తెలీవని చెప్పారు. ప్రెవేట్ వాహనాలను అడ్డుకుందాం ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు సకాలంలో బస్సులు రావడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సులకు జిల్లాలో డిమాండ్ పెరిగిందన్నారు. తక్షణం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జెడ్పీటీసీల సహకారంతో మండలాల వారిగా ప్రైవేట్ వాహనాలను కట్టడి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్పందించిన ఆర్ఎం త్వరలో ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుని సభ్యులను కలుస్తామన్నారు. అవగాహన కల్పించడంలో విఫలం స్థాయి సంఘం సమావేశాల్లో ఏడింటిలో నాలుగింటికి చైర్మన్ చమన్ అధ్యక్షత వహించగా మూడింటికి సుభాషినమ్మ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పథకాలు, రాయితీ స్కీములకు సంబంధించిన విషయాలను రైతులను చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సుభాషినమ్మ విమర్శించారు. అటవీశాఖ అధికారులు మొక్కల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. సమావేశం వాయిదా పెద్దవడుగూరు జెడ్పీటీసీ చిదంబరరెడ్డి ఒక్కరే హాజరు కావడంతో కోరంలేక స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం సమావేశాన్ని వాయిదా వేశారు. గతంలో జరిగిన సమావేశాల్లో కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమావేశం వాయిదా పడటం గమనార్హం. -
అబ్దుల్ కలాం మళ్లీ పుట్టాలి
-అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ బళ్లారి అర్బన్ : మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, యువతకు స్ఫూర్తిదాత, అన్నింటికి మించి మానవతావాది ఏపీజే అబ్దుల్ కలాం శాశ్వతంగా దూరం కావడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిందని, అలాంటి కలాం మళ్లీ పుట్టాలని అనంతపురం జిల్లా పంచాయతీ చైర్మన్ పీ.చమన్ పేర్కొన్నారు. గురువారం ఆయన బళ్లారికి వచ్చిన సందర్భంగా నగర శివార్లలోని గుగ్గరహట్టి పాండురంగ దేవస్థానం సమీపంలోని మున్నాబాయి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం సంతాప సభకు హాజరై మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డకు తమిళనాడులోని రామేశ్వరంలో ఘనంగా నివాళులు అర్పించి అంత్యక్రియలు జరిగాయన్నారు. ఆయన ఆత్మశాంతి కోసం అందరూ ఐదు నిమిషాలు మౌనం పాటించారు. కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి సెల్యూట్ చేశారు. కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆయన సేవలను స్మరించుకున్నారని కొనియాడారు. అబ్దుల్ కలాం అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో కణేకల్లు ఎంపీపీ ఫకృద్దీన్, బళ్లారి నగర మేయర్ నాగమ్మ చంద్ర, ఉపమేయర్ మాలన్‌బీ, జేడీఎస్ నాయకుడు మున్నాబాయి, ముండ్రిగి నాగరాజు, కార్పొరేటర్లు కెరెకోడప్ప, సూరి, ఉమాదేవి, శివరాజు, రాముడు, శర్మాస్, రసూల్‌సాబ్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.