లోగుట్టు పెరుమాళ్లకెరుక ! | discussion on zp chairman change | Sakshi
Sakshi News home page

లోగుట్టు పెరుమాళ్లకెరుక !

Published Wed, Apr 5 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

లోగుట్టు పెరుమాళ్లకెరుక !

లోగుట్టు పెరుమాళ్లకెరుక !

– జెడ్పీ చైర్మన్‌ మార్పుపై టీడీపీలో జోరుగా చర్చ
– చమన్‌ రాజీనామా చేయకపోవడంతో పూల నాగరాజులో ఆందోళన
– ఒప్పందం మేరకు తనకు పదవి ఇవ్వాలని పార్టీ నేతలపై ఒత్తిడి!
– అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కీలక నేతల హామీ
– నాగరాజుకు పీఠం దక్కకుండా మరో ‘రాజకీయం’?


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
    జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మార్పు విషయమై టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. ఒప్పందం మేరకు జనవరి ఐదో తేదీతోనే చమన్‌ పదవీకాలం ముగియడం, ఆపై టీడీపీ అధిష్టానం మరో మూడు నెలలు గడువు పొడిగించడం, ఆ కాలం కూడా ఈ నెల ఐదుతో ముగియడంతో జెడ్పీ పీఠంపై చర్చ మరింత జోరందుకుంది. చమన్‌ పీఠం దిగిపోతారా? పూల నాగరాజుకు చైర్మన్‌గిరి దక్కుతుందా? అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఒప్పందం మేరకు పదవిని తనకు కట్టబెట్టాలని  టీడీపీ కీలక నేతలపై నాగరాజు ఒత్తిడి తేవడంతో ఈ పంచాయితీని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు జిల్లా నాయకత్వం సిద్ధమైంది. వారం రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునేలా చూస్తామని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

            జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో జిల్లా పరిషత్‌ పీఠం ఆ పార్టీ వశమైంది. పార్టీ ఒప్పందం మేరకు మొదటి రెండున్నరేళ్లు చమన్‌, ఆపై గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూలనాగరాజుకు చైర్మన్‌గిరి కట్టబెట్టాలి. ఈ క్రమంలో డిసెంబర్‌ ఆఖరి వారంలో టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌ కొల్లు రవీంద్ర నేతృత్వంలో సమన్వయక కమిటీ సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రులు పల్లె, పరిటాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మ¯Œన్‌ చమన్‌  కూడా హాజరయ్యారు. ఒప్పందం మేరకు జెడ్పీపీఠం నాగరాజుకు ఇవ్వాలని మెట్టు గోవిందరెడ్డి ప్రస్తావించారు. దీనిపై జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి స్పందించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మరో ఆర్నెల్లు పొడిగించాలని చమన్‌తో పాటు మంత్రి పరిటాల సునీత చంద్రబాబును కోరగా మూణ్నెల్లు అవకాశమిచ్చారు. ఈ గడువు కూడా బుధవారంతో ముగిసింది. ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి పదవి కట్టబెట్టడం, ఎమ్మెల్సీగా దీపక్‌రెడ్డి ఉండటంతో మరో పదవిన అదే నియోజకవర్గానికి ఎందుకని టీడీపీలోని ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ అంశం తెరపైకి రావడంతో నాగరాజు అప్రమత్తమై జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు కీలకనేతల వద్ద విషయాన్ని ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

పూల నాగరాజును ఆయుధంగా చేసుకుని..
పార్టీలో సీనియర్‌ నేతలైన తమకు మంత్రి పదవి దక్కలేదని కొందరు, తాము సిఫార్సు చేసినవారికి పదవులు రాలేదని ఇంకొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కాలవ శ్రీనివాసులుకు మంత్రి పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రాయదుర్గం ప్రాంతానికి చెందిన దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. పూల నాగరాజుకు ఎలాగైనా జెడ్పీ చైర్మన్‌గిరి కట్టబెడితే నియోజకవర్గంలో కాలవకు చెక్‌పెట్టొచ్చని భావిస్తున్నారు. మంత్రిగా ఉండటంతో కాలవ నియోజకవర్గంలో తక్కువ సమయం గడిపే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో నాగరాజు, దీపక్‌రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధిస్తారని భావిస్తున్నారు. దీనికితోడు ఈ వర్గం మొత్తం మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగానూ పావులు కదుపుతోంది. చమన్‌ను దించడం ద్వారా సునీతకు చెక్‌ పెట్టడం, నాగరాజును ప్రమోట్‌ చేయడం ద్వారా రాయదుర్గంలో కాలవకు ఇబ్బందులు సృష్టించినట్లు అవుతుందనేది ఆ వర్గం లెక్క!

కొత్త చర్చతో నాగరాజులో ఆందోళన
 టీడీపీలో ఓ ఎమ్మెల్యే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పూల నాగరాజుకు చైర్మన్‌గిరి దక్కదని, దానిపై ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే చెప్పిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరిటాల వర్గం ధర్మవరం, పెనుకొండలో పూర్తిగా పట్టుకోల్పోయి రాప్తాడుకు మాత్రమే పరిమితమైంది. ఆ వర్గం వెంట నిలిచే నేతలు కరువయ్యారు. ఈ క్రమంలో చమన్‌ ఒక్కరే వారి వెంట నడుస్తున్నారు. ఈ క్రమంలో చమన్‌ను కూడా కాపాడుకోకపోతే రాప్తాడులోనూ ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. దీంతో చమన్‌ను జెడ్పీచైర్మన్‌గా కొనసాగించాలని, రాయదుర్గానికి జెడ్పీ పీఠం బదులుగా మంత్రి పదవి కేటాయిస్తే బాగుంటుందని మంత్రి సునీత, కాలవ శ్రీనివాసులు ఇద్దరూ కలిసి సీఎం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

దీనికి సీఎం కూడా అంగీకరించారని సదరు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ క్రమంలో నాగరాజుకు జెడ్పీ పీఠం దక్కకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాగరాజు దృష్టికి  కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర వేదన పడుతున్నట్లు సమాచారం. ఎవరి స్వార్థరాజకీయాలు వారు చూసుకుని.. పార్టీకోసం శ్రమించిన కార్యకర్తలను, ఒప్పందం మేరకు వారికి ఇచ్చిన మాటను తప్పితే పార్టీ ఎలాంటి సందేశాన్ని పంపినట్లు అవుతుందని నాగరాజు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ జెండా మోసిన వారిని కాదని, వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకున్నారని, ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నట్లు సమాచారం. ఏదిఏమైనా జెడ్పీచైర్మన్‌ పీఠం కేంద్రంగా టీడీపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అని ఇతర  పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement