
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ హఠాన్మరణం చెందారు. చమన్‌కు సోమవారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పరిటాల రవి కుమార్తె వివాహ వేడుకల పర్యవేక్షణ కోసం గత మూడు రోజులుగా చమన్ వెంకటాపురంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్తతకు గురైనట్టు సన్నిహితులు తెలిపారు. చమన్ మరణవార్త విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్.. రవి హత్య తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చమన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014 నుంచి 2017 వరకు ఆయన అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు.
సొమ్మసిల్లిన మంత్రి సునీత
చమన్ అస్వస్తతకు గురైన వార్త తెలుసుకున్న మంత్రి సునీత హుటాహుటిన సవేరా ఆసుపత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చమన్ చనిపోయారన్న వార్త విన్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు.