
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, దివంగత పరిటాల రవి (ఫైల్ ఫొటోలు)
సాక్షి, అనంతపురం : గుండు వివాదంపై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పరిటాల కుటుంబాన్ని కలుసుకున్నారు. చలోరే చలోరే చల్ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చోపచర్చలు చేశారు. పవన్ రాక సందర్భంగా పరిటాల నివాసం వద్ద కోలాహలం నెలకొంది. మంత్రి తనయుడు శ్రీరామ్ దగ్గరుండి పవన్‌ను లోనికి తీసుకెళ్లారు.
ఆసక్తికర వ్యాఖ్యలు : అల్పాహార విందు అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు ఉండేవికావని మరోసారి చెప్పుకొచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు, సీమకు పొంచిఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అని పవన్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు.
బాబు మాట.. టీడీపీ నేతలతో భేటీలు : తాను ఎవరికీ తొత్తు కాదన్న పవన్.. సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నట్లు ఇదివరకే చెప్పుకున్నారు. అయితే బీజేపీతో పొత్తుపై సీఎం చంద్రబాబు విరక్తివ్యాఖ్యల అనంతరం.. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పవన్‌తో భేటీలకు సిద్ధం అవుతుండటం జిల్లాల్లో చర్చనీయాంశమైంది. శనివారం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ప్రత్యేక భేటీ జరిపిన ఆయన ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటిలో అల్పాహారవిందు ఆరగించారు. ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ఇంకొందరు టీడీపీ కీలక నేతలు కూడా పవన్‌ను కలుస్తారని వినికిడి.