- ఉన్నతాధికారులు లేకుండానే స్థాయి సంఘం సమావేశాలు
- మరోసారి కోరం లేక స్త్రీ , శిశు సంక్షేమ శాఖ సమావేశం వాయిదా
అనంతపురం సిటీ : ‘వేల కోట్లు తాగునీటి కోసం విడుదల చేస్తున్నామని అటు ప్రభుత్వం, ఇటు జిల్లా కలెక్టర్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. మా గ్రామాల్లో 50 మందికి కూడా తాగునీరు అందడం లేదు. ఇంతకీ నిధులు ఉన్నాయా? లేక ఆ లెక్కలు కాగితాలకు పరిమితమా?’ అని కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరి అధికారులను ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్రల అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగానే పలువురు జెడ్పీటీసీలు ప్రభుత్వ పాలనా తీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాలకు చాలా శాఖలకు సంబంధించిన అధికారులు గైర్హాజరు కావడంతో సమావేశాలు చప్పగా సాగాయి. స్త్రీ శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘం సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఆరు అంశాలపై మాత్రమే చర్చ జరిగింది. మూడు అంశాలపై చర్చకు చైర్మన్‌గా సుభాషినమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశాలు కూడా పరిషత్‌లో షరా మామూలుగానే సాగాయి.
తాగునీటి పైనే ప్రధాన చర్చ
తాగునీటి సమస్యపై ప్రధాన చర్చ జరిగింది. కంబదూరు, కూడేరు మండలల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. వేల కోట్ల నిధులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా ఎందుకు ఖర్చ చేయడం లేదన్నారు. ఉన్నతాధికారి అందుబాటులో లేక పోవడంతో స్పందించిన కిందిస్థాయి సిబ్బంది త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
వివరాలు తెలీవు
పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణపు పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని సభ్యులు కోరడంతో నూతన ఎస్‌ఈ సుబ్బరావు ఇంకా తనకు పూర్తి వివరాలు తెలీవని చెప్పారు.
ప్రెవేట్ వాహనాలను అడ్డుకుందాం
ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు సకాలంలో బస్సులు రావడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బస్సులకు జిల్లాలో డిమాండ్ పెరిగిందన్నారు. తక్షణం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జెడ్పీటీసీల సహకారంతో మండలాల వారిగా ప్రైవేట్ వాహనాలను కట్టడి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. స్పందించిన ఆర్‌ఎం త్వరలో ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుని సభ్యులను కలుస్తామన్నారు.
అవగాహన కల్పించడంలో విఫలం
స్థాయి సంఘం సమావేశాల్లో ఏడింటిలో నాలుగింటికి చైర్మన్ చమన్ అధ్యక్షత వహించగా మూడింటికి సుభాషినమ్మ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పథకాలు, రాయితీ స్కీములకు సంబంధించిన విషయాలను రైతులను చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సుభాషినమ్మ విమర్శించారు. అటవీశాఖ అధికారులు మొక్కల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.
సమావేశం వాయిదా
పెద్దవడుగూరు జెడ్పీటీసీ చిదంబరరెడ్డి ఒక్కరే హాజరు కావడంతో కోరంలేక స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం సమావేశాన్ని వాయిదా వేశారు. గతంలో జరిగిన సమావేశాల్లో కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమావేశం వాయిదా పడటం గమనార్హం.
షరామామూలే..!
Published Tue, Jan 10 2017 11:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement