కారులో తిప్పుతూ అత్యాచారం
మూడురోజులపాటు మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం
అనంతపురం జిల్లా గుత్తిలో ఘటన
నిందితులపై నిర్భయ–పోక్సో చట్టం కింద కేసు..
గుత్తి (గుంతకల్లు): ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి.. మూడురోజులపాటు కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. దుండగుల చెర నుంచి బయటపడిన బాలిక తల్లిదండ్రులతో కలసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు బాధ్యులైన నిందితులిద్దరిపై పోలీసులు నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
గుత్తి ఎస్‌ఐ సుధాకర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుత్తి జంగాలకాలనీకి చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అటకాయించి, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు.
గుడి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జాడ కనుక్కోలేకపోయారు. ఈ క్రమంలో ఈనెల 8న (శనివారం) తెల్లవా రుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. తిప్పలు పడి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన ఉదంతాన్ని పోలీసులకు తెలియజేసింది. తనను కిడ్నాప్ చేశాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపించింది.
నిందితుడు అశోక్ పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్ ఆటోడ్రైవర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరిపై నిర్భయ కేసుతోపాటు సెక్షన్ 366 (కిడ్నాప్), 342 (నిర్బంధం), 376బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), 5 లేదా 6 (పోక్సో– నిర్భయ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వా సుపత్రికి తరలించారు.