వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖ తీసుకున్న విధానాలతో ఈ ఏడాది నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. 2018 క్రైం రౌండప్‌పై శుక్రవారం పోలీసు కార్యాలయ ఆవరణలో షాదీఖానా హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది 8125 ఐపీసీ నేరాలు జరగగా, ఈ ఏడాది 5981 నేరాలు నమోదయ్యాయని వివరించారు. స్పెషల్ లోకల్ లాస్ కేసులు గతేడాది 499 కేసులు చోటు చేసుకోగా ఈ ఏడాది 437 కేసులు మాత్రమే జరిగాయన్నారు. బాడిలీ అఫెన్సెస్ సంబందించి గతేడాది 2173 జరగగా ఈ ఏడాది 1643కు తగ్గిందన్నారు. వీటిలో అత్యాచారాలు మినహా అన్ని తగ్గుముఖం పట్టాయన్నారు. హత్యలు ఒక శాతం, రైటింగ్స్ 62శాతం, కిడ్నాపులు 28శాతం, హత్యాయత్నం కేసులు 23 శాతం తగ్గాయని పేర్కొన్నారు.
♦ లబ్ధి కోసం హత్యలు 75శాతం, దోపిడీలు 40శాతం, రాబరీలు 91శాతం, బర్గరీస్ 35శాతం, సాధారణ దొంగతనాలు 19శాతం తగ్గినట్లు వివరించారు. గతేడాది 50శాతం రికవరీ జరగగా.. ఈ ఏడాది రికవరీ 80శాతం జరిగిందని తెలిపారు.
♦ సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి 37శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. గతేడాది 1448 జరగగా ఈ ఏడాది 912 జరిగాయన్నారు. గతేడాది 622 మంది మృతి చెందగా 2076 మంది గాయపడ్డారన్నారు. ఈ సంవత్సరం 515 మంది మాత్రమే మృతి చెందగా 1193 మంది గాయపడ్డారని వివరించారు. 17.20శాతం మరణాలు తగ్గాయన్నారు.
♦ జిల్లాలలో ఈ ఏడా3ది ఫ్యాక్షన్ పూర్తిగా అదుపులోఉందన్నారు. ఫ్యాక్షన్ కట్టడి కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పినట్లు తెలిపారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
♦ సామన్య, పేద బతుకుల్ని చిద్రం చేస్తున్న మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై ప్రత్యేక నిఘా వేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ఏడాది 1508 మందిని అరెస్టు చేసి రూ.83 లక్షలు స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది 895 మందిని అరెస్టు చేసి రూ.1.90 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
17 శాతం తగ్గిన ఎస్సీ, ఎస్టీలపై నేరాలు
గతేడాది 191 ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 158 మాత్రమే జరిగాయన్నారు. ఈ నేరాలు 17శాతం తగ్గాయన్నారు. గ్రామాల సందర్శనకు వెల్లిన సందర్బాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో గ్రామ సభలు నిర్వహించి చట్టాల గురించి అవగాహన కల్పించినట్లు వివరించారు.
టెక్నాలజీ వినియోగంలో అవార్డు
జిల్లా పోలీసుశాఖ సాంతికతను భారీగా వినియోగిస్తోందన్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన జేఎన్‌టియూ ఎస్‌బీఐ బ్యాంకు దొంగతనం.. అంతకు మునుపు జరిగిన ఆవుల దొంగతనాల కేసుల ఛేదింపులో సాంకేతికత బాగా దోహదం చేసిందని గుర్తు చేశారు. జిల్లాలో అమలు చేసిన అఫెండర్ సర్వేలెన్స్‌కు ఫిక్కీ స్పెషల్ జూరీ స్మార్ట్ పోలీసింగ్ – 2018 అవార్డు, ఎక్స్‌ప్రెస్ ఇండియా టెక్నాలజీ సభ అవార్డు, స్కాచ్ అవార్డులు దక్కాయన్నారు.
♦ డయల్ 100, 9989819191 వాట్సాప్ నంబర్ల కాల్స్ ద్వారా సేవలు సద్వినియోగం చేసుకున్నవారికి సత్వర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు నంబర్లకు మొత్తం ఈ ఏడాది 23,290 కాల్స్ వచ్చాయని, ఇందులో 873 కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.
♦ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులు, రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునే వెసులుబాటును ‘ప్రీపెయిడ్ ఆటో బూత్’ ద్వారా కల్పించామన్నారు. ఈ ఏడాది ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న ఆటో బూత్ ద్వారా 86,220 మంది, రైల్వేస్టేషన్‌లో ఉన్న ఆటో బూత్ ద్వారా 1,15,500 మంది ఆటో సేవలు వినియోగించుకున్నారు.
♦ విద్యార్థి దశ నుంచే వివిధ చట్టాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు ఎస్పీ వివరించారు. రోడ్డు భద్రత, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, పోక్సో యాక్టు తదితర చట్టాలపై విద్యాసంస్థలకెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
సంక్షేమానికి పెద్దపీట
పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో తక్కువ ధరలకే ఆహారం అందించేందుకు పుడ్ కోర్టు, విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డు కుటుంబాల్లోని ఏడుగురికి హోంగార్డు ఉద్యోగాలు, సిద్ధరాంపురం సమీపంలో ఉన్న పోలీసుల ఇళ్ల స్థలాల ప్రాంతంలో రూ. 50 లక్షల వ్యయంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. పెట్రోలు బంకు నిర్వహణ ద్వారా జిల్లా పోలీసు సంక్షేమ నిధికి ఆదాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. పోలీసు పిల్లల ఉన్నత చదువుల కోసం మెరిట్ స్కాలర్ షిప్పుల పంపిణీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగు కోసం ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధిగస్తులను గుర్తించి మెరుగైన చికిత్సకు అవకాశం కల్పించడమే కాకుండా వారిని సుదూర ప్రాంతాల బందోబస్తుల నుంచి మినహాయింపునిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా జిల్లాలో సిబ్బంది సంక్షేమ చర్యలు అమలవుతున్నాయన్నారు.
మహిళలరక్షణకు పెద్దపీట
గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 40శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. 2017లో 1149 చోటు చేసుకోగా ఈ ఏడాది 694 మాత్రమే జరిగాయన్నారు. ఇందులో వరకట్న హత్యలు 91శాతం, మరణాలు 27శాతం, ఆత్మహత్యలు 43శాతం, వేదింపులు 45శాతం, వరకట్నం కేసులు 40శాతం, కిడ్నాపులు 42శాతం తగ్గాయని వివరించారు. అత్యాచారాలు మాత్రం గతేడాది 44 జరగగా ఈ ఏడాది 46 చోటు చేసుకున్నాయన్నారు. మహిళా రక్షక్ బృందాలు, మహిళా పోలీసు వలంటీర్ల సేవల ద్వారా నేరాలు తగ్గాయన్నారు.
నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా విధులు
నూతన సంవత్సరంలో మరింత సమర్థంగా పని చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని, ఆ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. మహిళల భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తామన్నారు. మెరుగైన సేవలందించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునేలా కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment