‘‘నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వస్తుందో? లేదో? నాకే తెలీదు. అధికారంలో లేనప్పుడు మీరెలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి రూ.వేల కోట్ల నిధులు ఇచ్చాం. అయినా పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే ఎంత సంపాదించారో, అవినీతి చిట్టా సీఎం వద్ద ఉంది.’’– ఈ నెల 22న టీడీపీ సమన్వయ కమిటీ భేటీలోఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమా
ఈ వ్యాఖ్యలు చూస్తే గత నాలుగున్నరేళ్లలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో? నిధులు ఏ తీరున దుర్వినియోగం అయ్యాయో, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో? అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఆయన వ్యాఖ్యాలను బట్టి తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాలు.. కుల, ఉద్యోగ సంఘాల్లో మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, వారితో పాటు సహచర మంత్రే దేవినేని. కానీ ఇంత పరుషంగా సొంత పార్టీ నేతలపై మండిపడ్డారంటే, దాని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఇట్టే తెలుస్తోంది. లేదంటే ‘అనంత’ టీడీపీ నేతలను మందలించే సాహసం దేవినేని చేయలేరు. చంద్రబాబు కూడా జిల్లా నేతలను గతంలో రెండుసార్లు అమరావతికి పిలిచి మందలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక్కడి పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, హద్దు దాటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ సీఎం మాటలను జిల్లా నేతలు గడ్డిపోచలా భావించారు. విని వదిలేయడం తప్ప వాటిని సీరియస్‌గా తీసుకోని పరిస్థితి. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు దోపిడీపర్వం కొనసాగించారు.
11 చోట్ల ఓటమి ఖాయం..
టీడీపీ మూన్నెల్ల కిందట ఓ సర్వే చేయించింది. అప్పట్లో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో ఓటమి ఖాయమని రిపోర్ట్‌లు వచ్చినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. తాజాగా డిసెంబర్ మొదటి వారంలో ఓ సర్వే పూర్తయింది. ఇందులో కూడా 11 చోట్ల ఓటమి ఖాయమని, మరో రెండు చోట్ల కూడా గడ్డుపరిస్థితి ఉందని తేలింది. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే మహబూబ్‌నగర్, నల్గొండ లాంటి జిల్లాల్లో ఆపార్టీ ఎలా తుడిచిపెట్టుకుపోయిందో, ఎలాంటి ఉద్ధండులు ఓడిపోయారో అచ్చం అదే తరహా పరిస్థితి జిల్లాలోనూ తప్పదని నిఘా వర్గాలతో పాటు పార్టీ సర్వేల్లోనూ చంద్రబాబుకు అవగతమైంది. దీంతోనే ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సభ్యత్వ నమోదు సాకుగా చూపి చంద్రబాబు అందరిపై ఫైర్ అయ్యారు. అనంతపురం, రాయదుర్గంతో పాటు చాలాచోట్ల సభ్యత్వ నమోదు దారుణంగా ఉందని మండిపడ్డారు. ‘జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నువ్వేం చేస్తున్నావని దేవినేనిని మందలించారు. ప్రత్యేకంగా దేవినేనిని పిలిచి క్లాస్ తీసుకున్నారు. ‘ఎమ్మెల్యేలు మోనోపోలీగా ఉన్నారు. వన్‌సైడ్ అయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి వేలకోట్ల నిధులిచ్చాం. ప్రతి ఒక్కరూ భారీగా ఆర్జించారు.
ఎవరెవరు ఎంత సంపాదించారో నా వద్ద లిస్ట్ ఉంది. ఇన్‌చార్జిగా నియమిస్తే నెలకోసారి వెళ్లి కబుర్లు చెప్పి వస్తున్నావా? ఇలా అయితే నీ కథ చూడాల్సి వస్తుంది’ అని చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. దీంతో ఉమా ఆ కోపం ఎమ్మెల్యేలపై చూపించినట్లు సమాచారం. చంద్రబాబు ప్రస్తావన రావడంతో ఎమ్మెల్యేలు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. పరిస్థితి చూస్తుంటే గత నెలలో సీఎం సమీక్షలతో శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు టిక్కెట్లు సిట్టింగ్‌లకు రావని తేలింది. ఆ సమీక్షల్లో ‘అనంత’ పేరు ఉన్నా, చౌదరి ఆఖరి నిమిషంలో దేవినేనితో మాట్లాడి సమీక్ష లేకుండా చేసుకోగలిగారు. ఈ లెక్కన ‘అనంత’ టిక్కెట్టు కూడా డౌటే. పోతే పెనుకొండ కావాలని నిమ్మల పట్టుబట్టడం, పల్లె రఘునాథరెడ్డి పూర్తి నిస్సత్తువగా మారిపోవడం, రాయదుర్గంలో కాలవను వ్యతిరేకించడం, మడకశిరలో ఈరన్న రాజీనామా తదితర అంశాలతో పార్టీ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో పోటీ ఎవ్వరూ లేరు కాబట్టి టిక్కెట్టు వస్తుంది. కానీ ఇక్కడా వారు గెలిచే పరిస్థితి లేదు. తక్కిన నియోజకవర్గాలతో పోలిస్తే వీటిల్లోనే టీడీపీ బాగా బలహీనపడిందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో జనవరిలో విడుదల చేసే తొలి జాబితాలో జిల్లా నుంచి నాలుగైదు పేర్ల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదే జరిగితే కనీసం ఐదుగురికి పైగా సిట్టింగ్‌లకు మూడినట్లే.
ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర
♦ రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌కు మంత్రి పరిటాల సునీత అన్యాయం చేయడం, ఆర్థికంగా దెబ్బతీసేందుకు మురళీ రూ.30కోట్లతో ఎస్‌వీఆర్‌ఎస్ పాలిమర్స్‌ను హైదరాబాద్‌లో స్థాపించారు.
♦ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగతంగా ఎదగాలనే స్వార్థంతో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి లాంటి వాళ్లను మంత్రి కాలవ దూరంపెట్టి పార్టీకి నష్టం చేశారు.
♦ కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే తనయుడు మారుతీ పూర్తిగా పార్టీ నేతలు, కార్యకర్తలను విస్మరించి తమ కుటుంబమే ఆర్థికంగా ఎదగాలని దోపిడీకి తెరలేపినట్లు చర్చ జరుగుతోంది.
♦ బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో పీఏలు ఏకంగా హిందూపురంలో దుకాణం పెట్టారు.
♦ వలసొచ్చిన అత్తార్ చాంద్‌బాషా ప్రతీ పనిలో కమిషన్లు ఆరగిస్తున్నారనే అపవాదు ఉంది.
♦ తాడిపత్రిలో అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్ ఫ్యాక్షరీల నుండి ట్రాన్స్‌పోర్ట్‌ల వరకూ అన్నిటిలోనూ జేసీ బ్రదర్స్ వేలుపెడుతుండటం తెలిసిందే.
♦ ధర్మవరంలో ఎమ్మెల్యే సూరి ఆర్థికంగా ఎక్కడికో ఎదిగిపోయారనేది బహిరంగ రహస్యం.
♦ జయరాంనాయుడు లాంటి లీడర్లతో పాటు ఉమామహేశ్వర్, లాలెప్ప, విద్యాసాగర్, దుర్గేశ్ లాంటి కార్పొరేటర్లను కూడా ఎమ్మెల్యే చౌదరి కక్షకట్టినట్లు వ్యవహరించి పార్టీని బలహీనపర్చారనే చర్చ ఉంది.
♦ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ హంద్రీ–నీవా, గాలిమరల భూముల కొనుగోళ్లలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
♦ చివరకు ‘కియా’లోని కొరియా ఉద్యోగులు తమ దేశం నుంచి ‘లిక్కర్’ తెచ్చుకోవాలన్నా’ కప్పం కట్టండి అని ఎమ్మెల్యే పార్థసారథే చెబుతున్నట్లు ఎంపీ నిమ్మల కిష్టప్ప పరోక్షంగా సీఎంకు ఫిర్యాదు చేశారు.
ఒక్కో నియోజకవర్గంలో రూ.3వేల కోట్ల వరకూ అవినీతి
మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో రూ.3వేల కోట్ల వరకూ అవినీతి జరిగింది. ఈ మొత్తం ‘అవినీతి’లో సింహభాగం ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళితే ఆ తర్వాత స్థానం ఆ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, ఆ పార్టీ అండతో పనులు దక్కించుకున్న ఏజెన్సీలు లబ్ధి పొందాయి. మూడోస్థానంలో నేతల కుటుంబీకులు, అస్మదీయులు ఉన్నారు. చివరగా పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు వెనకేసుకున్నారు. మొత్తంగా కార్యకర్తలకు ఒరిగింది ఏమీలేదు. ఇక్కడే తేడా కొట్టింది. ‘ఎంత చెప్పినా కార్యకర్తలను కలుపుకుని వెళ్లలేదు. వారి బాగోగులు పట్టించుకోలేదు’ అనే దేవినేని ఉమా పదేపదే వ్యాఖ్యానించారు.
సొంతపార్టీ కార్యకర్తలే ఆయా నియోజకవర్గాల్లో సాగిన అవినీతిని పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తుండటమే అందుకు నిదర్శనం. టీడీపీ నేతల అవినీతి బాగోతాలను వందల సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తూ వచ్చారు. కానీ గతంలో చేయించిన సర్వే చూస్తే తర్వాత వచ్చే సర్వే మరింత దారుణంగా ఉంటోంది. ‘అనంత’పై చంద్రబాబు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. దీంతోనే నెలకోసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. మారాల రిజర్వాయర్‌కు నీళ్లిచ్చేందుకు గత నెలలో వచ్చి ఏకంగా రెండురోజులు మకాం వేసి అర్ధరాత్రి 2గంటల వరకూ నియోజకవర్గ సమీక్షలు నిర్వహించి సహజశైలికి భిన్నంగా కార్యకర్తల సమక్షంలోనే ఎమ్మెల్యేలను మందలించారు. ఎన్ని చేసినా పరిస్థితి మాత్రం దారికి రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment