రాజకీయ చదరంగంలో ఒక్కో నిచ్చెన ఎక్కాలంటే సేవే మార్గమనుకున్నారు. 2014 ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు పక్కాప్లాన్‌తో ఏడాది నుంచి చేతికి ఎముకే లేదన్నట్టు అడగని వారికి.. అడిగిన వారికి లేదనకుండా శక్తి మేర సమర్పించుకున్నారు. పేదోళ్లు కన్పిస్తే చాలు గుండెలు కరిగించుకున్నారు. ఇలా ఇన్నాళ్లూ బిజీబిజీగా గడిపిన నేతలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ లభించే అవకాశం లే దన్న నిర్ధారణతో తెరమరుగయ్యారు.
సాక్షి, అనంతపురం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ ఆశించిన కొందరు నాయకులు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తూ పార్టీ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్న డబ్బుంతా విదిలించుకున్నారు. సేవలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో విజయం సాధించినా.. పార్టీ అధినేత దృష్టిలో మాత్రం పడినట్లు లేరు. ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసి
పోయిన డబ్బులు లెక్కలేసుకుంటూ.. కక్కలేక.. మింగలేక లోలోన మదనపడిపోతున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత పార్టీ టికెట్ ఆశించి ఏడాది నుంచి విస్త్రృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటూ లెక్కకు మించి ఖర్చు చేసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సదరు నాయకుడికి పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఏడాది వరకు నియోజకవర్గంలో రోజుకు రెండు మూడు గ్రామాలను చుట్టేసి.. ఎక్కడ ఎవరు పిలిచినా అనుచరులతో కలసి వాలిపోయినా నేత.. తన లక్ష్యం నెరవెరేలా లేదని గ్రహించి సేవలకు రాం..రాం...చెప్పారు.
హిందూపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్టు తెచ్చుకోవాలని ఉబలాటపడ్డారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం నుంచి పాదయాత్ర మొదలు పెట్టడంతో.. ఇదే అదునుగా భావించి చేతికి ఎముకలేదన్నట్లుగా అధినేత పాదయాత్ర కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సొంత ఖర్చులతోనే చేశారు. ఆసాంతం జనంలో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ కలరింగు కూడా ఇచ్చుకున్నారు. అయితే ఈ నాయకుడికి టికెట్టు రాదని ఇటీవల తేలిపోవడంతో నిండామునిగానన్న ఆవేదనలో ఉన్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో బాగా గడించారు. దీనికి తోడు కాంట్రాక్టు పనులు చేసి అనతికాలంలోనే కోట్లు సంపాదించారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్టు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో టీడీపీలోని పెద్దలతో పరిచయాలు పెట్టుకుని..పలుమార్లు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగారు. పార్టీలోని రెండు పెద్ద తలకాయలు ఇచ్చిన హామీ మేరకు..నియోజకవర్గంలో విస్త్రృతంగా పర్యటించారు. గుడులు..గోపురాలకు ఇతోదిక విరాళాలు అందజేశారు. యువతకు క్రికెట్ కిట్లు, పండుటాకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో అయిన కాటికి ఖర్చు చేసి పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. తీరా చూస్తే..ఈ నాయకునికి కాకుండా మరో నాయకునికి అధిష్టానం టికెట్టు ఖరారు చేయనున్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు. తనకు హామీ ఇచ్చిన పెద్ద తలకాయలు సైతం తామేమి చేయలేమని చేతులెత్తేయడంతో ఏమి చేయాలో పాలుపోక చేసిన ఖర్చుల చిట్టాను చూసుకుంటూ ఉండిపోతున్నారు.
పస్తుతం మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘ఈ ఎన్నికల్లో నేను తలదూర్చను బాబూ’ అంటూ పరుగులెత్తుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడిది ఇదే పరిస్థితి. 2009లో పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ ఈ నాయకుడు..ఈ సారి ఎలాగైనా టికెట్టు సాధించుకోవాలని నియోజకవర్గంలో తనదైన శైలిలలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ పోయారు. ప్రసుత్తం ఈయనకు కూడా టికెట్టు వచ్చే పరిస్థితి లేదు.
అనంతపురంలో తొలి నుంచి ఒకరు నియోజకవర్గ బాధ్యులుగా వ్యవహరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో ఏ శుభకార్యానికి ఆహ్వానం అందినా రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని అయినా తానే అంతా అయి చూసుకునేవారు.
ఇప్పుడు ఆయనను కాదని మరొకరి పేరు అధినేత పరిశీలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన మునిసిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో నాయకుడు తొలి నుంచి అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట టికెట్టు దక్కించుకోవాలన్న లక్ష్యంతో తెగ ఖర్చు చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌కు కూడా విరాళాలు అందజేశారు. అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే ఓ ట్రస్టును ఏర్పాటు చేసి.. ఆ ట్రస్టు ద్వారా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ వచ్చారు. ఇంత చేసినా టికెట్టు దక్కదన్న విషయం తెలుసుకున్న ఆ నాయకుడు సైకిల్ దిగి.. మరో చెట్టుచాటున చేరారు.
అయ్యయో.. జేబులు ఖాళీ ఆయెనే..!
Published Mon, Mar 10 2014 3:22 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement