అరెస్టులకు నిరసనగా.. రేపు అనంతపురం బంద్
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిల అరెస్ట్లకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యతో అనంతపురంలో చేలరేగిన అల్లర్లకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలు కారణమంటూ వారిద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దాంతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అయితే వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య అనంతరం జరిగిన ఆందోళనలకు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఆ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్యను చేధించాల్సిన పోలీసులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల అరెస్ట్ అమానుషమని చెప్పారు. టీడీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలానికి వారు రావడమే తప్పయితే ఎస్పీ రావడం సమంజసమా? అంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్నారాయణలు సూటిగా ప్రశ్నించారు.