కరీంనగర్ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రధాన రహదారులన్ని నిఘానేత్రం నీడలోకి వచ్చేశాయి. ప్రధాన రహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కరీంనగర్‌లోని ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాలను అమర్చగా.. తాజాగా జిల్లాకేంద్రానికి నాలుగువైపుల ఉన్న రహదారుల్లో కెమెరాలను రూరల్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌కు వచ్చే వాహనాల రాకపోకల వివరాలను నమోదు చేసేందుకు వీలుగా పది సీసీ కెమెరాలను అమర్చారు.
నేరాల నియంత్రణలో కీలకం..
సీసీ కెమెరాల ఏర్పాటుతో రహదారుల్లో జరిగే నేరాలను నియంత్రించే అవకాశముంది. రాజీవ్హ్రదారి, రాయపట్నం స్టేట్‌హైవేలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి పలువురు దుర్మరణం చెందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించే అవకాశం లేకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదాలు చేసి ఆగకుండా వెళ్తున్న వాహనాల డ్రైవర్లు, వివిధ ప్రాంతాల్లో నేరాలు చేసి తప్పించుకుంటున్న నేరస్తుల కదలికలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో జరిగే బంగారం, నకిలీనోట్లు, కలప, నకిలీమద్యం, బాలికల అక్రమ రవాణా కార్యకలపాలను పరిశీలించే వీలుంటుందని రూరల్ ఎస్సై సృజన్‌రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా వీలైనంత త్వరలో నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
ఎస్పీ కార్యాలయానికి కనెక్షన్
ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలకు సంబంధించిన కనెక్షన్‌ను ఎస్పీ కార్యాలయానికి త్వరలో ఇవ్వడానికి రూరల్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోనే వీటిని ఆపరేటింగ్ చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి కనెక్షన్ ఇచ్చినట్లయితే అక్కడినుంచే నాలుగు రహదారుల్లోని వాహనాల రాకపోకలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశముంటుంది. జిల్లాకేంద్రంలోకి ప్రవేశించే నేరస్తులు, ఇతర అనుమానాస్పద వ్యక్తులను గమనించి పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా నేరాలను నియంత్రించడానికి అవకాశం ఏర్పడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
నలుదిక్కులా నిఘా
Published Sun, Jan 19 2014 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement