నౌకాభారం
- విశాఖ-అండమాన్ నౌక టికెట్ ధరల పెంపు
- కూలీలు, సామాన్య ప్రయాణికులపై భారం
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ నౌక టికెట్ ధరలు మళ్లీ పెరిగాయి. డీలక్స్ నుంచి ఫస్ట్‌క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్, బంక్.. ఇలా అన్ని విభాగాల్లోనూ పెంచారు. జలమార్గం ద్వారా అండమాన్‌కు వెళ్లాలనుకునే వారికి విశాఖ నుంచి నడిచే ఈ నౌకే ఏకైక ఆధారం. దీన్ని సాకుగా తీసుకుని అండమాన్ ప్రభుత్వం ఏటేటా ధరలు పెంచుకుంటూ పోతోంది, గతేడాది ఒక్కో విభాగానికి రూ.500 చొప్పున పెంచగా, ఈసారి గరిష్టంగా రూ.400 చొప్పున పెంచింది. మరోపక్క రాష్ట్రం నుంచి నడిపే ఈ నౌకలో అసలే మాత్రం కనీస సౌకర్యాలతోపాటు భద్రత ఉండడం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా సామాన్య, పర్యాటక ప్రయాణికులపై అదే పనిగా భారం మోపుతుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెలకోసారి నడిపే ఈ నౌకకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. విశాఖ నుంచి నికోబార్, నాన్‌కౌరీ, స్వరాజ్‌దీప్ అనే మూడు నౌకలను అండమాన్ ప్రభుత్వం నడుపుతుంది. ఒక్కో నౌకలో డీలక్స్, ఫస్ట్‌క్లాస్ క్యాబిన్, సెకండ్ క్లాస్ క్యాబిన్, బంక్ నాలుగు రకాల టికెట్లుంటాయి. ఒక్కోదానికి ఒక్కో రేటు. ప్రస్తుతం స్వరాజ్‌దీప్ నౌకలో డీలక్స్ క్యాబిన్ టికెట్ ధర రూ.8,420 కాగా రేటు పెంచిన తర్వాత రూ. 8,814కు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్యాబిన్ ధర రూ.6,970 నుంచి రూ,7319, సెకండ్ క్లాస్ రూ.5,540 నుంచి రూ.5,817, కూలీలు అధికంగా ప్రయాణించే బంక్ ధర రూ.2150 నుంచి రూ.2,268 వరకు పెరిగింది.
అండమాన్‌కు వెళ్లే నౌకలో అతి తక్కువ ధరైన బంక్ విభాగానికి కూలీల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. బంక్ విభాగం ధర పెంచవద్దని అదేపనిగా ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా అండమాన్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. అండమాన్‌లో ఏళ్లతరబడి స్థిరపడిన వాళ్లకు అక్కడి ప్రభుత్వం పౌరసత్వం ఉంది. వీళ్లల్లో తెలుగువాళ్లు చాలామందే ఉన్నారు. వీరితోపాటు అండమాన్ పౌరులు కూడా వివిధ పనుల పై విశాఖకు వస్తుంటారు. వీళ్లకు నౌక టికెట్లో సగానికిపైగా రాయితీ అమలవుతోంది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం వీరికి డీలక్స్ టికెట్ రూ.4, 568, ఫస్ట్‌క్లాస్ క్యాబిన్ టిక్కెట్ రూ.3, 740 నుంచి రూ.4127, సెకండ్ క్లాస్ రూ.2,810 నుంచి రూ.3098, బంక్ రూ.750 నుంచి రూ.830కి పెరిగింది.