తొలి పద్దు.. పాతవాటితో సద్దు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో జిల్లాకు కనీస ప్రాధాన్యమైనా దక్కలేదు. గత ప్రభుత్వ హయూంలో చేసిన ప్రతిపాదనలను బడ్జెట్‌లో చూపించి.. వాటిని తాము కొత్తగా చేపట్టబోతున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గొప్పలు పోయూరు. ఏలూరులో శిల్పారామం, పేరుపాలెం బీచ్‌లో రిసార్ట్స్ నిర్మిస్తామంటూ పాత ప్రతిపాదనలను కొత్తగా తెరపైకి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు మాత్రం పైసా కూడా కేటాయించలేదు. వ్యవసాయానికి 9గంటలు, గృహాలకు 24గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినా ఎప్పటినుంచి ఇస్తారో స్పష్టం చేయలేదు.
చెప్పినవన్నీ పాతవే
మొత్తంగా బడ్జెట్‌ను చూస్తే పాత ప్రాజెక్టులనే మళ్లీ ప్రకటించడం మినహా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమీ కనిపించలేదు. ఏలూరు నగరంలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. నిజానికి ఈ ప్రతిపాదన గతంలోనే ఉంది. ఏలూరులోని పంపుల చెరువు వద్దగల గులాబీతోట ప్రాంతంలో నగరపాలక సంస్థకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని శిల్పారామం ఏర్పాటుకు కేటాయించేలా గత కలెక్టర్లు సంజయ్‌జాజు, వాణీమోహన్ ప్రతిపాదనలు రూపొం దించారు. నగరపాలక సంస్థ స్థలంలో శిల్పారామం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక నాయకుడు పగడాల వెంకటరత్నం నాయుడు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రతిపాదన మూలనపడింది. అనంతరం తంగెళ్లమూడి ప్రాం తంలోని 1వ డివిజన్ ఎమ్మార్సీ కాలనీ వద్ద దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం ఏర్పాటుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి హోదాలో కావూరి సాంబశివరావు సార్వత్రిక ఎన్నికల ముందు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది.
చిరంజీవి హామీ ఇది
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో రిసార్ట్స్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో సినీ నటుడు చిరంజీవి ప్రకటించారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ.10 కోట్లు ఖర్చుకాగల ప్రతిపాదనలు రూపొందిం చారు. దీనికి తాజాగా బడ్జెట్‌లో స్థానం కల్పించారు. ఇక విజయవాడ-కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎరుుర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇది కూడా కొత్త ప్రతిపాదన కాదు. 2004లో అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆలోచన చేశారు. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు జిల్లాలోని తాడేపల్లిగూడెంను అనుకూల ప్రాంతంగా గుర్తించారు. అక్కడి విమానాశ్రయ భూముల్లో ఎరుుర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి టెండర్లు కూడా పిలిచారు. సత్యం రామలింగరాజుకు చెందిన మైటాస్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాత కంపెనీ పలు కేసుల్లో ఇరుక్కోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది వెల్లడించకపోయినా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పూర్తి విద్యుత్ ఎప్పటినుంచి ఇస్తారు
వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న 7గంటల విద్యుత్ సరఫరాను 9గంటలకు పెంచుతామని, గృహాలకు రోజంతా అందిస్తామని చెప్పినప్పటికీ ఎప్పటి నుం చి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. వృద్ధులకు రూ.వెరుు్య, వికలాంగులకు రూ.1,500 పింఛన్ అందిస్తామని, ప్రతి గ్రామానికి రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. వీటన్నిటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనినిబట్టి చూస్తే ఇవి కూడా ప్రజలకు పూర్తిస్థారుులో దక్కవనే విషయం అర్థమవుతోంది. అన్నిటికంటే ముఖ్యమైన రుణమాఫీకి బడ్జెట్‌లో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించడం జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు
కోస్తా జిల్లాల్లోని రైతుల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టుకు తొలి బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం కేటారుుంపులు చేయలేదని టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ రాష్ట్ర వాటాగా కనీస కేటాయింపులు చేయకపోతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగే పరిస్థితి లేదు.