సాక్షి, ఢిల్లీ: 14 నెలల పాటు పాకిస్తాన్ చెరలో మగ్గిన ఆంధ్రా జాలర్లు భారత్‌కు చేరుకున్నారు.వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు 20 మంది మత్స్యకారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకారులకు స్వాగతం పలికారు. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది.
మత్స్యకారులకు ఇవాళే సంక్రాంతి..
అమరావతి : రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 13 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్ మత్స్యకారులందరి కళ్లలో ఈ రోజు కొత్త కాంతి కనిపిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. మంత్రి మోపిదేవి స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లి వారిని స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకు రావడం మత్స్యకారుల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, చిత్తశుద్ధికి అద్దం పట్టింది. సోమవారం భారత్ పాక్ సరిహద్దు వద్ద పాక్ అధికారులు వారి చెరలో ఉన్న మత్స్యకారులను మంత్రి మోపిదేవి బృందానికి అప్పగించారు.
(చదవండి: రేపు విశాఖకు మత్స్యకారులు)
ఎవరికి ఆపద వచ్చినా సీఎం జగన్ ఉన్నారు..
వాఘా: మత్స్యకారులకు ఇదొక పునర్జన్మ అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. వాఘా సరిహద్దు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. మత్స్యకారులను రేపు ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలిస్తామని పేర్కొన్నారు. పాకిస్తాన్ చెరలో ఉంటే బయటకు వస్తారా..లేదా అనే సందేహం అందరికి ఉంటుందని.. అటువంటి పరిస్థితుల్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించగలిగామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన కృషి కారణంగా మత్స్యకారులు విడుదలయ్యారని తెలిపారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాల వలన ఇద్దరు మత్స్యకారుల విడుదల ఆగిపోయిందని..త్వరలో వారిని కూడా విడిపిస్తామని మంత్రి మోపిదేవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment