ఎగువశెంబి వద్ద బంగారం నిల్వలు ఉన్నాయని భావిస్తున్న కొండ
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. 2014లో నవ్యాంధ్రగా రూపాంతరం చెందింది. ఈ 66 ఏళ్లలో ఎన్నో రాజధానులు మారాయి. భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ, దాదాపు 75 ఏళ్లుగా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో గిరి శిఖరాన గల కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం తేలలేదు. అక్కడి ఆదివాసీలు తమను ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి తీసుకెళ్లాలని ఏళ్ల తరబడి కోరుతుండగా.. అక్కడున్న అపార ఖనిజ నిక్షేపాలపై కన్నేసిన ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంపై పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఆ ప్రాంతాన్ని వశం చేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు.. వాటిమధ్య అమాయక ఆదివాసీలు.. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ శివారు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని 34 గిరి శిఖర గ్రామాల సమాహారమైన కొటియా ప్రాంతమది. విలువైన ఖనిజ నిక్షేపాలకు నిలయమైన ఆ ప్రాంతంపై ఒడిశా ప్రభుత్వం కన్నేసింది. ఆ గ్రామాలను వశం చేసుకునేందుకు పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనుల వేగం పెంచి.. రహదారులు, ఆస్పత్రి, వసతి గృహాలను నిర్మిస్తోంది. త్వరలో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతోంది.
ఓటుహక్కు వినియోగించుకోలేని గిరిజనులు
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా గ్రూప్ గ్రామాల్లో విరివిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు జరిగేవి. దండిగాం నుంచి కొటియాకు తారు రోడ్డు మంజూరైంది. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మించారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను ఎవ్వరూ పట్టించుకోలేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. గత ఎన్నికల్లో కొటియా ప్రజలు ఆంధ్రా ఓట్లను వినియోగించుకోలేకపోయారు. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఖనిజ నిక్షేపాల కోసమే ఆరాటం
ఇక్కడ ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఒడిశా ఆరాటపడుతోంది. ఒడిశా ప్రభుత్వం ఇక్కడ కొన్నేళ్లుగా రహస్యంగా ఖనిజాన్వేషణ చేస్తోంది. ఎగువశెంబి, కొటియా, కుంబిమడ మధ్య బంగారం నిక్షేపాలు గల కొండ ఉందనే ప్రచారం నేపథ్యంలో దానిని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పాగా వేసేందుకు గిరిజనులకు సౌకర్యాల ఎర వేస్తోందని ఆ ప్రాంత గిరిజన నాయకులు చెబుతున్నారు.
రూ.180 కోట్లతో ఎర
కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే కోరాపుట్ గిరిజన (పరబ్) పండుగకు సుమారు రూ.15 లక్షలు వెచ్చించింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లతోపాటు మరో 21 గ్రామాలకు కొత్తగా రహదారులు నిర్మిస్తోంది. 10 పడకల ఆస్పత్రి, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్, పోలీస్ స్టేషన్, పాఠశాల, వారపు సంతలో వసతులు, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర మధ్య ఆశ్రమ పాఠశాల, కొండనుంచి వచ్చే ఊట నీరు కిందికి వృథాగా పోకుండా ట్యాంక్‌ల ద్వారా స్థానిక పంటలకు మరల్చడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది.
గంజాయిభద్రలో పాఠశాల భవన నిర్మాణం
అసలు వివాదం ఇదీ
స్వాతంత్య్రానికి పూర్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటు ఆలోచన సాగింది. దానికోసం బ్రిటిష్ ప్రభుత్వం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ–ఒడిశా మధ్య సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో ఒడిశా రాష్ట్రంలో విలీనం చేయగా మిగిలిన కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు. ఈ గ్రామాలు తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. అప్పట్లో 21 మాత్రమే ఉన్న ఆ గ్రామాల సంఖ్య ఇప్పుడు 34కి పెరిగింది. ఇక్కడ 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు. వీరు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నేటికీ పరిష్కారం లభించలేదు.
గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం.. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొటియా ప్రజలకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాం.
– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు
ప్రభుత్వం పట్టించుకోవాలి
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా మా ప్రాంతాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఒడిశా ప్రభు త్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మాకు మాత్రం ఆంధ్రావైపు ఉండాలని ఉంది.
– బీసు, మాజీ ఉప సర్పంచ్, గంజాయిభద్ర
త్వరలో పర్యటిస్తా
కొటియా గ్రామాల్లో త్వరలో పర్యటిస్తాను. ఈ గ్రామాల అభివృద్ధికి ఆం ధ్రా ప్రభుత్వం తరఫున కృషి చేస్తాం. దీనిపై సమ గ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం.
– బీఆర్ అంబేడ్కర్, ఐటీడీఏ పీవో, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment