ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
హైదరాబాద్ : తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టిన ప్రధాన ప్రతిపక్షం మూడో రోజు కూడా సభను స్తంభింపజేసింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేసిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ తప్ప మరొకటి సమ్మతం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా నినదించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో అసెంబ్లీ మార్మోగిపోయింది.
మరో వైపు విపక్ష సభ్యుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం మూడు రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని తీర్మానం చేసింది. సభలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించిన సభ్యులపై శాశ్వతంగా వేటు వేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించారు. సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. వీడియో ఫుటేజ్ పరిశీలించాక వైఎస్సార్‌సీపీ సభ్యులపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.