మద్యం మాఫియాకు చెక్‌ | Andhra Pradesh Assembly Approved Liquor Control Amendment Act | Sakshi
Sakshi News home page

మద్యం మాఫియాకు చెక్‌

Published Thu, Jul 25 2019 10:21 AM | Last Updated on Thu, Jul 25 2019 10:43 AM

Andhra Pradesh Assembly Approved Liquor Control Amendment Act - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. మద్యం దుకాణాల లైసెన్సులు, మద్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ బిల్లును రూపొందించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా ‘ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్, ఫారిన్‌ లిక్కర్‌ యాక్ట్‌–1993ను సవరిస్తూ మంగళవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, బుధవారం కూలంకుషంగా చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది. 

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే.. : ఈ బిల్లును శాసనసభ ఆమోదించడంతో రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా అడుగు ముందుడుగు పడింది. ప్రస్తుతం మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దాంతో వారు లైసెన్స్‌ షరతులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. నిర్ణీత సమయాలతో నిమిత్తం లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇష్టానుసారంగా బెల్డ్‌ షాపులు నిర్వహిస్తూ సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు విలువైన మానవ వనరులను నష్టపోవాల్సి వస్తోంది. పేదల కుటుంబాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. దాంతో ప్రజల నుంచి.. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ విషయమై మహిళలు కొన్నేళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. తన పాదయాత్రలో ఈ పరిస్థితులను గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. దశల వారీగా మద్యం నిషేధమే ఈ సమస్యకు పరిష్కారమని భావించారు. ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పర్వాలేదు ప్రజల బతుకులు బాగు పడాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు తాజాగా మద్య నియంత్రణ చట్టం సవరణ కోసం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలను ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సభకు వివరించారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బిల్లును సమర్థిస్తూ ప్రసంగించారు. పేదలు, మహిళల జీవితాలను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అనంతరం ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

మద్యం పీడ వదిలించడానికే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ సామాజిక వేత్తగా, ఓ తత్వవేత్తగా ఆలోచించి మద్యం మహమ్మారి పీడ వదిలించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. మద్యం.. ఆడపడుచుల గుండెకు చేసిన గాయాన్ని నయం చేయడానికి సీఎం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తమ ఆదాయ వనరుగా భావించడం దురదృష్టకరం. మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. కానీ విలువైన మానవ వనరులు, సామాజిక సంపద తరిగిపోతోంది. మద్యం పేదల జీవితాలను కబళించివేస్తోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి.  ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పేద మహిళల కష్టాలను చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం రక్కసి అంతు చూడటానికి మొదటి అడుగుగా ఈ బిల్లును తీసుకువచ్చారు. అందుకే ఆయనకు ఈ రాష్ట్ర ఆడపడుచుల తరపున కృతజ్ఞతలు.
– భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి 


మూల కారకుడు చంద్రబాబే : రోజా

‘పేదల జీవితాలను నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని రూపు మాపడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారానే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్ట సవరణ తేవడం సంతోషకరం. ఎందుకంటే ప్రైవేటు షాపుల యజమానులు బెల్డ్‌ షాపులు పెట్టి దోచుకుంటున్నారు. దీనికి చంద్రబాబే మూల కారకుడు. ఆయన ప్రభుత్వం ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల విలువైన మద్యాన్ని ఏరులై పారించింది. 40 వేల బెల్డ్‌ షాపులు ఏర్పాటు చేసింది. కానీ 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. అదీ చంద్రబాబు ప్రభుత్వ విధానం. కానీ మన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యాన్ని దశల వారీగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అదీ ఆయన నిబద్దత’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించింది చంద్రబాబు ప్రభుత్వమేనని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. మద్యం మాఫియాను అంతం చేసేందుకు సీఎం జగన్‌ గొప్ప బిల్లు తీసుకువచ్చారని కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ కొనియాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement