సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. 5 కోట్లు జనాభా దాటిన పది రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. అత్యధిక పరీక్షలు చేయడంతోపాటు అతి తక్కువ ఇన్ఫెక్షన్ రేటు (పరీక్షించిన వారిలో వ్యాధి సోకిన వారి సంఖ్య), రికవరీ రేటు విషయంలో ఏపీ ఎంతో ముందుంది. దేశంలో 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్ రేటు 0.92 శాతంగా ఉంది. 1.01 శాతం ఇన్ఫెక్షన్ రేటుతో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. దేశ సగటు ఇన్ఫెక్షన్ రేటు 4.48 శాతంగా ఉండడం గమనార్హం. అత్యధికంగా ఇన్ఫెక్షన్ రేటు సోకిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (13.64 శాతం), గుజరాత్ (7.68 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
3టీ వ్యూహంతో కట్టడి..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ 3టీ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేసింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్(మూడు టీలు–అనుమానితుల గుర్తింపు, పరీక్షలు చేయడం, తగిన చికిత్స అందించడం) విధానాన్ని పటిష్టంగా అమలు చేయడమే ఈ ఫలితాలకు కారణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో పలు దఫాలు సర్వేలు చేయడం ద్వారా కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించింది. పాజిటివ్ లక్షణాలున్న వారిని కోవిడ్ హాస్పిటల్స్‌కు తరలించి అత్యున్నతమైన వైద్యసాయంతో వేగంగా కోలుకునేలా చేస్తోంది. అంతేకాదు.. వైరస్ సోకిన వ్యక్తితో నేరుగా సంబంధాలున్నవారిని, అతను కలిసిన వారిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కాంటాక్టు కేసులను వేగంగా గుర్తించి వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. ఈ విధానం సత్ఫలితాలిస్తుండటంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ప్రాంతాలు క్రమేపీ తగ్గుతున్నాయి. యాక్టివ్ క్లస్టర్ల సంఖ్య తగ్గుతూ గ్రీన్‌జోన్ల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఈ 3టీ విధానం సత్ఫలితాలిస్తుండడంతో మిగిలిన రాష్ట్రాలూ ఏపీ నమూనాను అనుసరిస్తున్నాయి.
రికవరీలోనూ రాష్ట్రమే ఫస్ట్..
ఇక రికవరీ రేటు విషయంలో 65.82 శాతంతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. రికవరీ రేటు విషయంలో ఏ రాష్ట్రమూ ఏపీ దరిదాపుల్లోనే లేవు. 56.61 శాతం రికవరీ రేటుతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (28.40 శాతం), బిహార్ (26.27 శాతం), కర్ణాటక (31.04 శాతం)లు అత్యంత వెనుకబడి ఉన్నాయి. దేశీయ సగటు రికవరీ రేటు 41.28 శాతంగా ఉంది. 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రికవరీ రేటు 58.91 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment