15లోగా ముగించండి
విభజన ప్రక్రియ పూర్తికి గవర్నర్ నరసింహన్ డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారులను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తాజాగా ఆదేశించారు. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 వరకు ప్రక్రియను కొనసాగిస్తే సహించేది లేదని, తాను విధించిన గడువును పొడిగించబోనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే విభజన ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలు సమర్పించిన సిఫారసులను కూడా ఆయన ఆమోదించారు. వీటిని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అధికారులను పురమాయించారు. ఈ సిఫారసుల ఆధారంగానే కేంద్రం నోటిఫికేషన్లు జారీ చేయనుంది. సోమవారంనాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్, ఏఎన్ రాయ్‌లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌పీ టక్కర్, డాక్టర్ ఎన్. రమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్, రామకృష్ణారావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర ఇందులో పాల్గొన్నారు.
ఈ నెల 15లోగా విభజనకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని, ఎలాంటి పనులూ పెండింగ్‌లో ఉండరాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. జూన్ 2 తర్వాత ఏర్పడే ఇరు రాష్ర్ట ప్రభుత్వాలకూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్ పదికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అపెక్స్ కమిటీ క్షుణ్నంగా అధ్యయనం చేసిందని, అన్ని శాఖలు, కమిటీల నివేదికలను పరిశీలించిందని సీఎస్ మహంతి వివరించారు. 22 ప్రభుత్వ శాఖల్లోని అత్యవసర విభాగాలను తక్షణమే విభజించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ మేరకు సిఫారసు చేసినట్లు తెలిపారు. కాగా షెడ్యూల్ తొమ్మిది కిందకు వచ్చే పరిశ్రమలు, కార్పొరేషన్లు, సహకార సంస్థలు మొత్తం 89 ఉండగా.. వీటిలో అత్యవసరంగా 20 సంస్థలను విభజించాల్సి ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, విత్తన పంపిణీ, ఏపీ మార్కెటింగ్ కార్పొరేషన్, పౌరసరఫరాల సంస్థ, ఆర్టీసీ వంటివి ఈ జాబితాలో ఉన్నట్లు గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ సంస్థల ఆడిటింగ్ కూడా పూర్తయిందని పేర్కొన్నారు.