హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి 27 వరకూ జరుగుతాయని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 7న గవర్నర్ ప్రసంగం, 12న సాధారణ బడ్జెట్, 13న వ్యవసాయ బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై కొంత ఉంటుందని యనమల సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. కేంద్ర బడ్జెట్ను అధ్యయనం చేస్తున్నామని, వాటికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు.
పన్నులు పెంచే ఆలోచన లేదని, ఉన్న పన్నులను సక్రమంగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లెవీ సేకరణ 25 శాతానికి తగ్గించడం, ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఆదాయం తగ్గిందని యనమల అన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.850 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఏసీడీపీ నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని యనమల తెలిపారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు చేస్తామని యనమల వెల్లడించారు.
12న ఆంధ్రప్రదేశ్ సాధారణ బడ్జెట్
Published Mon, Mar 2 2015 2:30 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM
Advertisement